43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. కరోనా వైద్య పరికరాలకు సంబంధించి జీఎస్టీ విధింపు అంశంపై చర్చించామని ఆమె తెలిపారు. విరాళంగా వచ్చిన వైద్య పరికరాలపై జీఎస్టీ మినహాయించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రాలు దిగుమతి చేసుకుంటున్న వైద్య పరికరాలపైనా జీఎస్టీ మినహాయిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మినహాయింపులు ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. అంఫోటెరిసిన్ ఔషధంపైనా జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. నూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు.

Also Read:కరోనా వ్యాక్సిన్‌పై జీఎస్టీని తొలగించలేము.. అలా చేస్తే వాటి ధరలు మరింత పెరుగుతాయ్‌: ఆర్ధిక మంత్రి

సెస్, సర్ ఛార్జీల రూపంలోనే కేంద్రానికి ఎక్కువ ఆదాయం  వస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గత ఆర్ధిక సంవత్సరంలో 18 శాతం సెస్, సర్ ఛార్జీల రూపంలోనే కేంద్రానికి ఆదాయం లభించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. 22.17 లక్షల కోట్ల బడ్జెట్‌లో సెస్, సర్వీస్ ఛార్జీల రూపంలో కేంద్రానికి రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని హరీశ్ రావు వెల్లడించారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్, సర్వీస్ ఛార్జీల వల్లే.. రాష్ట్రాలు 41 శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రతి ఏటా 2.102 శాతం ఆదాయాన్ని కోల్పోతోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ నుంచి న్యూట్రల్ ఆల్కహాల్‌ను మినహాయించాలని ఆయన కోరారు.