మరోసారి ఉబర్ క్యాబ్ వార్తల్లోకి ఎక్కింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్.. మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో.. బాధితురాలు తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ లో తెలియజేసింది. కాగా.. ఆమె ట్వీట్ వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఉబర్ కారు ఎక్కింది. కారులో ఏసీ సరిగా రావడం లేదని.. చల్లగా లేదని అడిగినందుకు నీచంగా మాట్లాడాడు. దీంతో..ఆమె ట్విట్టర్ లో..‘‘‘సభ్యతలేని ఉబర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముందు అతను ఏసీ వేయడానికే నిరాకరించాడు. అనంతరం ఏసీ వేసినా చల్లగా లేకపోవడంతో ఉక్కపోతగా ఉందని అడిగాను. దానికి అతను ‘అంత ఉక్కపోతగా ఉంటే వచ్చి నా ఒళ్లో కూర్చో’ అని వికృతంగా సమాధానమిచ్చాడు. గమ్యస్థానం చేరే వరకు నన్ను దించడానికే ప్రయత్నించాడు. ఆ సమయంలో నా భర్త కూడా నా వెంటే ఉన్నాడు’’ అని  పేర్కొంది.

ఢిల్లీ పోలీసులను, ఉబర్ క్యాబ్ సంస్థను  ఆ ట్వీట్ కి ట్యాగ్ చేసింది. అంతే కాకుండా తాను ప్రయాణించిన కారు, ఆ కారు డ్రైవర్ ఫొటోలను కూడా జత చేసింది. కాగా ఉబర్ దీనిపై స్పందించింది. ‘‘ఇలాంటి సంఘటన గురించి తెలిసి బాధపడుతున్నాను. మా టీమ్ ఈమెయిల్ ద్వారా మీకు బదులిచ్చింది. మీకింకేమైనా సందేహాలుంటే అడగండి’ అని పేర్కొంది.