నీ వల్లే కుక్క చనిపోయిందని..పనిమనిషికి చిత్రహింసలు..గాయాలతో మరణం

sisters assault and murder a 17 year old servant in Chennai
Highlights

ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క పనిమనిషి వల్లే చనిపోయిందన్న అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆమెకు చిత్రహింసలు పెట్టి చంపేశారు. 

ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క పనిమనిషి వల్లే చనిపోయిందన్న అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆమెకు చిత్రహింసలు పెట్టి చంపేశారు. చెన్నై బిసెంట్‌నగర్‌కి చెందిన మురుగానందం తన భార్య సుస్మితాప్రియతో కలిసి నివసిస్తున్నారు.. వీరికి కాంచీపురంలో గ్యాస్ ఏజెన్సీ ఉంది.. వీరి ఇంట్లో మహాలక్ష్మీ అనే రాజమండ్రికి చెందిన యువతి పనిమనిషిగా పనిచేస్తోంది.

ఇటీవల విదేశాలకు వెళ్లిన సుస్మితా ప్రియా అక్కడి నుంచి ఓ కుక్కపిల్లను తెప్పించుకుని పెంచుకుంటోంది. అదంటే ఆమెకు పంచప్రాణాలు.. కొద్దిరోజుల క్రితం ఆ కుక్క మరణించింది. అది చనిపోవడానికి పనిమనిషి మహాలక్ష్మే కారణమనే అనుమానంతో సుస్మితా ప్రియా ఆమె చెల్లెలు మిత్రాక్షితో కలిసి రోజూ చిత్రహింసలు పెట్టేది.. వాతలు పెట్టడంతో పాటు, సలసల కాగుతున్న వేడినీటిని పనిమనిషి  శరీరంపై పోస్తూ ఉండేవారు. వారి వేధింపులకు తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మీ మూర్చవ్యాధికి గురై మరణించింది.

దీని నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు ఫోన్ చేసి.. తమ ఇంటి పనిమనిషి మూర్చవ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులకు ఆమె శరీరం నిండా బొబ్బలు, వాతలు కనిపించడంతో అనుమానం కలిగింది.. దీంతో సుస్మితను, మిత్రాక్షిని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పారు. తాము పెట్టిన హింసవల్లే మహాలక్ష్మీ చనిపోయిందని అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజమండ్రిలోని మహాలక్ష్మీకి సమాచారం అందించారు.
 

loader