Sirohi: రాజస్థాన్ లోని సిరోహి జిల్లా అబూ రోడ్ లోని బ్రహ్మకుమారీస్ సంస్థాన్ కు చెందిన శాంతివన్ లో జల్ జన్ అభియాన్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. బ్రహ్మకుమారీస్ సంస్థాన్, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దేశవ్యాప్త ప్రచారంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సినీ నటుడు నానా పటేకర్, ప్రముఖులు పాలుపంచుకున్నారు.
Prime Minister Narendra Modi: నీటి భద్రతను ప్రధాన అంశంగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకృతితో దేశానికి ఉన్న భావోద్వేగ సంబంధాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికతను ప్రోత్సహించే బ్రహ్మకుమారీస్ అనే సంస్థ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన జల్ జన్ అభియాన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సిరోహి జిల్లాలోని బ్రహ్మకుమారీస్ అబూ రోడ్ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. నీటి సంరక్షణ సమిష్టిగా జరగాలనీ, నీటి కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, నటుడు నానా పటేకర్, మేవార్ రాజకుటుంబ మాజీ సభ్యుడు లక్ష్యరాజ్ సింగ్ హాజరయ్యారు. 10 కోట్ల మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల పాటు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇంత పెద్ద జనాభా కారణంగా, నీటి భద్రత భారతదేశానికి ముఖ్యమైన ఆందోళన అనీ, ఇది మనందరి భాగస్వామ్య బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నీళ్లు ఉంటేనే రేపటి భవిష్యత్తు ఉంటుందని, ఇందుకోసం నేటి నుంచి ఉమ్మడిగా కృషి చేయాలని మోడీ పౌరులకు పిలుపునిచ్చారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశ ఆధ్యాత్మికతలో నీటి సంరక్షణ ఒక భాగమని ఆయన అన్నారు.
"అందుకే నీటిని దైవం అంటాం, నదులను తల్లి అంటాం. ఒక సమాజం ప్రకృతితో భావోద్వేగ సంబంధం ఏర్పరుచుకున్నప్పుడు, ప్రపంచం దానిని సుస్థిర అభివృద్ధి అని పిలుస్తుందని" ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాగా, ఈ క్యాంపెయిన్ లో భాగంగా బ్రహ్మకుమారీస్ సంస్థాన్, జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన వారు దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా నీటి వనరులను పరిరక్షించడానికి, కొత్త నీటి వనరులను నిర్మించడానికి ఎనిమిది నెలల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్యాంపెయిన్ ద్వారా పది వేల కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పది కోట్ల మందికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశానికి 800 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరాలు..
కేవలం 300 మిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని మాత్రమే ఆపగలమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రస్తుతం దేశానికి 750-800 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరముందని తెలిపారు. యాభై ఏళ్ల క్రితం మన దేశంలో ప్రతి వ్యక్తికి ఐదు వేల క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, ఇప్పుడు అది 1500 క్యూబిక్ మీటర్లకు పడిపోయిందని తెలిపారు. ప్రపంచంలో నీటిని భగవంతునిగా భావించే సంప్రదాయం ఉండేదని తెలిపారు. పర్యావరణం గురించి మాట్లాడే, ఆందోళన చెందే ప్రపంచ శాస్త్రవేత్తలు నేడు ఎక్కువగా భయపడుతున్నారనీ, ప్రపంచ తాగునీటిలో 4 శాతం, ప్రపంచ జనాభాలో 18 శాతం భారత్ లో ఉన్నాయని తెలిపారు.
అమెరికా, చైనాలతో సమానంగా భూమి నుంచి నీటిని సేకరిస్తున్నాం..
పద్మశ్రీ ప్రముఖ నటుడు నానా పటేకర్ మాట్లాడుతూ తాను నేడు గ్రామంలో నివసిస్తున్నాను, కానీ ఏదో పని మీద సిటీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటాను. మనకు పరిమిత వనరులు ఉన్నందున జనాభా పెరగకుండా ఆపాలి. నీరు లేకుండా జీవితం అసంపూర్ణం, మనకు లేనిదానికి ధర లేదు. రెండు రోజులు వెంటిలేటర్ పై ఉంటే ఏడు లక్షల బిల్లు చెల్లిస్తాం. కానీ భగవంతుడు మనకు ఉచితంగా ఇచ్చిన గాలి, నీటికి మనం విలువ ఇవ్వడం లేదు. జీవితంలో దేవుడి లాంటి వ్యక్తులను కలిశాను, వారితో సంబంధంలోకి వచ్చిన తరువాత మాకు చాలా మార్పులు తీసుకువచ్చారని అన్నారు.
