బిడ్డ పెళ్లికి 18 లక్షలు బ్యాంక్ లాకర్‌లో దాచిపెట్టింది.. ఏడాది తర్వాత తెరిస్తే షాక్
ఆ మహిళ రూ. 18 లక్షల నగదును బ్యాంకు లాకర్‌లో దాచి పెట్టింది. బిడ్డ పెళ్లి కోసం అందులో ఉంచింది. ఏడాది కావస్తుండటంతో అగ్రిమెంట్ రెన్యువల్ కోసం సిబ్బంది ఆమెను సంప్రదించడంతో ఆమె బ్యాంకుకు వచ్చింది. లాకర్ ఓపెన్ చేయగానే.. అందులోని నగదుకు చెదలు పట్టింది. వినియోగించరానంతగా డ్యామేజీ అయిపోయాయి. ఇది చూసి ఆమె షాక్ అయ్యారు.
న్యూఢిల్లీ: బిడ్డ పెళ్లి కోసం రూపాయి రూపాయి జమ చేసుకుని 18 లక్షలు కూడబెట్టుకుంది. ఆ రూ. 18 లక్షలను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు లాకర్‌లో దాచిపెట్టింది. ఆ డబ్బులు పెళ్లి కోసమే ఖర్చు చేయాలనుకుంది. డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలంటే తరుచూ లాకర్ ఓపెన్ చేయవద్దని అనుకుంది. గతేడాది అక్టోబర్‌లో దాచిపెట్టిన డబ్బును అందుకే మళ్లీ చూడాలని అనుకోలేదు. అయితే.. బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ రావడంతో అనివార్యంగా వెళ్లాల్సి వచ్చింది. అంతా సరిగా ఉన్నదా? అని చూస్తూ తన లాకర్ ఓపెన్ చేశారరు. షాక్. ఆ లాకర్‌లో ఉన్న డబ్బు కట్టలకు చెదలు పట్టింది. అంతా పాడైపోయాయి. ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. బ్యాంకు అధికారులు కూడా ఖంగుతిన్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో అఫియానా బ్రాంచ్ లాకర్‌లో అల్కా పాఠక్ రూ. 18 లక్షలు దాచిపెట్టారు. మళ్లీ అటువైపు వెళ్లి తన డబ్బులను చూసుకోలేదు. అయితే.. ఏడాది గడుస్తున్నందున బ్యాంకు సిబ్బంది ఆమెను సంప్రదించి లాకర్ అగ్రిమెంట్ రెన్యువల్ కోసం, కేవీసీ వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి రావాలని తెలిపారు. దీంతో ఆమె బ్యాంకుకు వెళ్లారు.
ఆమె ఆబగా డబ్బులను చూసుకోవడానికి లాకర్ ఓపెన్ చేశారు. లాకర్‌లోని దృశ్యం చూసి షాక్ అయింది. డబ్బంతా చెదలు పట్టి తుక్కుగా మారిపోయింది. ఇది చూసి ఆమె బిత్తరపోయారు. బ్యాంకు సిబ్బంది కూడా విస్మయపోయారు. దీనిపై వారు తమ హెడ్ క్వార్టర్‌కు నివేదిక పంపినట్టు సిబ్బంది తెలిపారు.
Also Read: ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు ఎందుకు ముగిసింది? బీజేపీకి గడ్డుకాలమేనా? పొత్తుల చరిత్ర ఏమిటీ?
డబ్బంతా చెదలు పట్టిపోవడంతో మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బ్యాంకు అధికారులతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకు నుంచి లేదా ఆర్బీఐ నుంచి ఏదైనా ఆమెకు ఊరట దక్కుతుందా? అని ఆమె ఆశగా చూస్తున్నారు. దీనిపై స్పష్టత లేదు. లాకర్ నిబంధనల ప్రకారం డబ్బు అందులో పెట్టరాదు. నగదు నిల్వ చేసుకోవడానికి లాకర్ ఉపయోగించుకోరాదని బ్యాంక్ ఆఫ్ బరోడా లాకర్ అగ్రిమెంట్ కూడా పేర్కొనడం గమనార్హం.