సింగర్ శుభ్ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు - హర్ సిమ్రత్ బాదల్
సింగర్ శుభ్ గొప్ప దేశ భక్తుడు అని, ఆయన తన దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ హర్ సిమ్రత్ బాదల్ అన్నారు. అతడు భారత్ గర్వించదగిన కళాకారుడు అని పేర్కొన్నారు.
ఖలిస్తాన్ కు మద్దతిస్తున్నారనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయకుడు శుభ్ కు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ హర్ సిమ్రత్ బాదల్ మద్దతుగా నిలిచారు. శుభ్ తన దేశభక్తిని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, అతను గర్వించదగిన భారతీయుడని, పంజాబ్ బిడ్డ అని అన్నారు. శుభ్ భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రతిభావంతుడైన కళాకారుడు అని అన్నారు.
‘‘సింగర్ శుభ్.. మేం మీకు అండగా ఉంటాం. మీరు మీ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పంజాబ్, భారతదేశం గర్వించదగిన కుమారుడు. పంజాబ్ కోసం మాట్లాడే శుభ్, ఇతరులను దేశద్రోహులుగా ముద్రవేసే కుట్రలకు బలైపోవద్దని అకాలీదళ్ తోటి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.’’ అని అన్నారు.
అసలేం జరిగిందంటే ?
పంజాబీ-కెనడియన్ ర్యాపర్ శుభ్ నీత్ సింగ్ (శుభ్) ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్నాడనే కారణంతో ర్యాపర్ 'స్టిల్ రోలిన్ ఇండియా టూర్' గతంలో రద్దయింది. అయితే దీనిపై ఆయన స్పందించారు. తన భారత పర్యటన రద్దవడంతో తాను చాలా నిరుత్సాహానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు నెలలుగా తన భారత పర్యటన కోసం తీవ్రంగా సాధన చేస్తున్నానని, దేశంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు.
పంజాబ్ కు చెందిన యువ ర్యాపర్-సింగర్ గా నా సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావాలన్నది తన జీవిత కల అని శుభ్ వెల్లడించారు. కానీ ఇటీవల జరిగిన ఘటనలు తన కృషిని, పురోగతిని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘భారత్ కూడా నా దేశమే. నేను ఇక్కడే పుట్టాను. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, దాని వైభవం కోసం, కుటుంబం కోసం త్యాగాలు చేయడానికి కంటి రెప్పకూడా వేయని నా గురువులు, నా పూర్వీకుల భూమి ఇది. పంజాబ్ నా ఆత్మ, పంజాబ్ నా రక్తంలో ఉంది. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం పంజాబీనే' అని తన ఆయన పేర్కొన్నారు.