ఈ నెల 14వ తేదీన ఫ్రాన్స్‌లో నిర్వహించే బాస్టిల్ డే పరేడ్‌లో ఫ్రెంచ్ సైన్యంతోపాటుగా భారత మిలిటరీ కూడా పాల్గొననుంది. ఇందులో వైమానిక దళానికి చెందిన బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నేతృత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్ అయిన ఆమె ఎంఐ 17ను హెలికాప్టర్‌ను ఆపరేట్ చేస్తారు.

న్యూఢిల్లీ: అమెరికా, ఈజిప్టులలో స్టేట్ విజిట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీన ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే పరేడ్‌కు హాజరు కాబోతున్నారు. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత ఈ పరేడ్‌కు హాజరుకాబోతున్న రెండో పీఎం మోడీనే. విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకారం, ఈ పరేడ్‌లో ఫ్రెంచ్ భద్రతా దళాలతోపాటుగా భారత ఆర్మీ, నావికా, వైమానిక దళాలు కూడా పాలుపంచుకుంటాయి.

ప్యారిస్‌లోని చాంప్స్ ఎలిసీలో జరిగే ఈ పరేడ్‌లో ఫ్రెంచ్ మిలిటరీతోపాటు భారత మిలిటరీ నుంచి 269 మంది సభ్యులు ఇందులో పాల్గొంటారు. నారీ శక్తికి అవకాశాలు ఇవ్వాలనే సంకల్పంలో భాగంగా భారత వైమానిక దళం బస్టిల్ పరేడ్‌లో ఐఏఎఫ్ బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నేతృత్వం వహిస్తారు.

సింధు రెడ్డి ఎవరు?

స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్. ఆమె ఎంఐ 17ను నడుపుతారు. ఐఏఎఫ్‌లో తొమ్మిదేళ్ల సర్వీసు కాలంలో ఆమె ఉత్తర, దక్షిణ భారత్‌లోని పలు బేస్ స్టేషన్‌లలో ఆమె సేవలు అందించారు.

Scroll to load tweet…

ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్‌లోనూ ఆమె 144 సభ్యుల ఐఏఎఫ్ బృందాన్ని పర్యవేక్షించారు. ఆ బృందంలో ఏకైక మహిళ ఆమెనే కావడం గమనార్హం.

‘నేను వైమానిక దళంలో చేరినప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు నేతృత్వం వహించాలని అనుకునేదాన్ని. చివరకు ఆ అవకాశం నాకు దక్కింది’ అని ఆమె గతంలో చెప్పారు. అప్పుడు కూడా స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి మాత్రమే ఆ బృందంలో ఉన్న ఏకైక మహిళ అధికారి. ‘పరేడ్ బృందానికి సారథ్యం వహించడానికి నేను తగినదాన్ని అని నాకు తెలుసు. కానీ, దాని కోసం రెండు నెలలు కఠోర సాధన చేయాల్సి వచ్చింది’ అని ఆమె చెప్పారు. 2018లోనూ ఐఏఎఫ్ మార్చ్ బృందంలో ఆమె పాల్గొన్నారు.

Also Read: యూసీసీతో అసమానతలు ఇంకా పెరుగుతాయి: లా కమిషన్‌కు ఎంకే స్టాలిన్ లేఖ

పరేడ్‌లో పాల్గొనడానికి సింధు రెడ్డి ఎప్పుడూ ఆసక్తి ప్రదర్శించేవారు. ఆమె బెంగళూరులో ఎన్సీసీ క్యాడెట్‌గా ఉన్నప్పటి నుంచీ ఆమెకు ఈ ఉత్సుకత ఉండేది. దీనితోడే ఆమె పరేడ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చేవారు. అది చూసే ఆమెను కాలేజీ రోజుల్లోనే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంచుకున్నారు. 

‘నేను ఎగరాలి అనుకున్నాను. అందుకు మా నాన్న ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. కాలేజీలో నేను ఎన్సీసీలో చేర్చారు. తద్వార అది ఇటువైపుగా ప్రోత్సహించడానికి ఉపకరించింది’ అని సింధురెడ్డి వివరించారు.

రక్షణ శాఖ ప్రకారం, భారత్ నుంచి వెళ్లుతున్న భద్రతా బృందంలో.. ఆర్మీ నుంచి 77 మంది, దానికి బ్యాండ్ బృందం 38 సభ్యులు ఉన్నారు. దీనికి కెప్టెన్ అమన్ జగతాప్ సారథిగా ఉంటారు. అలాగే, నేవీ బృందానికి కమాండర్ వ్రత్ భగేల్, ఎయిర్ ఫోర్స్ బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి సారథ్యం వహిస్తారు.