ఖలిస్తాన్ నాయకుడు అమృత్‌పాల్ కోసం పోలీసుల వేట.. ప్రభుత్వానికి సిక్కు సంఘాల హెచ్చరికలు
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో సిక్కు సంస్థలు స్పందిస్తున్నాయి. ఇప్పటి వరకు పంజాబ్ అనుభవించింది చాలని, ఇకనైనా గతం తాలూకు గాయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ సూచించారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తూ వుండటంతో పంజాబ్ అట్టుడుకుతోంది. నిన్న పోలీసులకు చిక్కినట్లే చిక్కిన అమృత్‌పాల్ వారి కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతనిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిక్కు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. అకల్ తఖ్త్ లంటే సిక్కుల అత్యున్నత స్థానం, దీనికి జతేదార్ అనే వ్యక్తి అధిపతిగా వుంటారు.
పంజాబ్ ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవిచూసిందని.. ఇప్పుడు భవిష్యత్తు వైపు వెళ్లాల్సిన సమయం వచ్చిందని గియానీ అన్నారు. పంజాబ్‌కు గతంలో తీవ్ర గాయాలయ్యాయని.. వాటిని నయం చేసేందుకు ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాల వివక్ష కారణంగా సిక్కు యువతలో తీవ్ర అసంతృప్తి వుందన్నారు. కొందరు యువకులను బ్రెయిన్ వాష్ చేసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని హర్‌ప్రీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. ఇంకొందరి చేతికీ ప్రశ్నాపత్రం .. నిందితుల వాట్సాప్ చాట్‌తో వెలుగులోకి
తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, సిక్కుల ధీర్ఘకాల మత, రాజకీయ, ఆర్ధిక సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. సిక్కుల మధ్య వున్న పరాయీకరణ భావాన్ని తొలగించాలని హర్‌ప్రీత్ కోరారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అత్యధిక త్యాగాలు చేసిన సిక్కులలో పరాయీకరణ భావాన్ని సృష్టించడంలో ఎప్పటికప్పుడు వివక్ష ఒక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు తమ పూర్వీకులు చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని హర్‌ప్రీత్ డిమాండ్ చేశారు.
కాగా.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో సిక్కు అత్యున్నత స్థానం నుంచి మత పెద్దలు ఈ విధమైన ప్రకటనలు చేయడం పంజాబ్‌లో కలకం రేపుతోంది. అటు అమృత్‌పాల్ ఇంకా పరారీలోనే వున్నాడు. అతని మద్ధతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని అమృత్‌పాల్ సహాయకులు కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు.