టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. ఇంకొందరి చేతికీ ప్రశ్నాపత్రం .. నిందితుల వాట్సాప్ చాట్‌తో వెలుగులోకి
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజశేఖర్ మరికొందరికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి రెండో రోజు నిందితుల సిట్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌లో కొత్త లింకులు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్ మరికొందరికీ పేపర్ ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాట్సాప్ చాట్‌ను సిట్ రిట్రీవ్ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి సర్క్యూలేట్ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా విచారించారు అధికారులు. వీరి ముందు చాట్ డేటా పెట్టి ప్రశ్నలు సంధించారు. ప్రవీణ్ రాజశేఖర్‌లు కలిసే పేపర్ లీక్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు అధికారులు. అంతేకాకుండా ఐదు పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ చాట్‌లో గుర్తించారు అధికారులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ఇక, టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదికతో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ .. తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు , విద్యార్ధుల పేరు చెప్పి సర్కార్‌కు చురకలు