Asianet News TeluguAsianet News Telugu

చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావద్దు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

శ్రద్ధావాకర్ మర్డర్ కేసు విషయంలో సహజీవనం చేసే మహిళల మీద కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

Shraddha Walkar murder : Union minister Kaushal Kishore remarks on live-in relationship
Author
First Published Nov 18, 2022, 9:31 AM IST

బీహార్ : కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.. శ్రద్ధా వాకర్ హత్యకు లివ్ ఇన్ రిలేషన్ షిపే కారణమని చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదు అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కోరారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారితీస్తోందని పేర్కొంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి భాగస్వాములతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తప్పుపట్టారు.

‘అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎందుకు జీవిస్తున్నారు? ఇలాంటి రిలేషన్ షిప్ కు తల్లిదండ్రులు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే కోర్టు మ్యారేజ్ చేసుకొని కలిసి జీవించాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదు. శ్రద్ధా వాకర్ హత్య కేసు నుంచి నేర్చుకోవాలి. తమ తల్లిదండ్రుల ఆమోదంతో ఎవరితోనైనా ఉండాలి’  అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్  వ్యాఖ్యానించారు. దీనిమీద శివసేన నాయకురాలు  ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్ లో తీవ్రంగా స్పందించారు. చౌకబారు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని తొలగించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసు : పోలీసులకు సవాల్ గా మారిన సాక్ష్యాల సేకరణ..

ఇదిలా ఉండగా, నవంబర్ 16న పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్ళపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధ తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగు పొరుగు వారు, ఆమె నివసించే ఫ్లాట్ యజమాని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. 

దీనివల్ల మొత్తం కుటుంబం నష్టపోయిందని ఆమె అన్నారు. ఇది సమాజ వైఫల్యం అని.. స్నేహితులు కూడా విఫలం అయ్యారని కిరణ్ బేడీ అన్నారు. అమ్మాయిలకు భరోసా ఇవ్వడంలో కుటుంబం పాత్ర ముఖ్యమని తెలిపారు. డేటింగ్ యాప్ లో ఆఫ్థాబ్ ఎంతగా నిమగ్నమయి వున్నాడో అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఓ రకంగా నేరానికి దారితీసిన పరిస్థితులను శ్రద్ధా చూసిందని ఆమె చెప్పారు. అమ్మాయిలు ధైర్యంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని.. జీవితంలో ఛాలెంజెస్, రియాలిటీల గురించి తల్లిదండ్రులు చెప్పాలని అన్నారు. 

ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి శ్రద్ధా వాకర్ ని, ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్యచేశాడు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈ భయంకరమైన నేరం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి 18 రోజుల పాటు రాత్రిపూట ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడేశాడు. 2019నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు సొంత నగరం ముంబైని వదిలి ఢిల్లీలో నివాసముంటున్నారు. మే 18 పెళ్లి గురించి ఇద్దరి మధ్య గొడవ కావడంతో శ్రద్ధను గొంతు కోసి చంపాడు. ఆరు నెలల తర్వాత తన కూతురు కనిపించడం లేదని శ్రద్ధ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

ఆఫ్తాబ్ చెప్పిన వివరాల మేరకు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు శ్రద్ధ మృతదేహంలోని సుమారు 12 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తల మాత్రం ఇంకా లభించలేదని మంగళవారం తెలిపారు. పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న మృతదేహం ముక్కలు శ్రద్ధావి కాదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆఫ్తాబ్ తో కలిసి మంగళవారం మెహ్రౌలీ అడవుల్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ సుమారు రెండున్నర గంటలపాటు సోదాలు నిర్వహించారు. విచారణలో ఆఫ్తాబ్ పదే పదే వాంగ్మూలాన్ని మారుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios