ఉదయనిధి సనాతన వ్యాఖ్యలపై సరైన సమాధానాలు ఇవ్వాలి: మంత్రులకు ప్రధాని మోడీ సూచన
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సరైన సమాధానాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రులకు సూచనలు చేశారు. చరిత్రలోకి వెళ్లొద్దని సూచించినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సరైన సమాధానాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రులకు బుధవారం సూచనలు చేశారు. మంత్రివర్గంలో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది.
‘చరిత్రలోకి వెళ్లకండి. రాజ్యాంగం ప్రకారం ఫ్యాక్ట్స్‌కు కట్టుబడి ఉండండి. ప్రస్తుత పరిస్థితులు, సమస్యలపై కూడా మాట్లాడండి’ అని ప్రధాని మోడీ చెప్పారు.
ఇండియా వర్సెస్ భారత్.. దేశం పేరు మార్పుపై కూడా మంత్రులు మాట్లాడవద్దని సూచించారు. ఆ అంశంపై అందుకు సంబంధించిన వారే మాట్లాడుతారని చెప్పారు.
సనాతన ధర్మాన్నిడెంగ్యూ మలేరియాతో పోల్చుతూ దాన్ని వెంటనే నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాంటి వాటిని ఆపడం కాదు.. నాశనం చేయాలని పిలుపు ఇచ్చారు. బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత తాను సనాతన ధర్మాన్ని పాటించేవారిని చంపేయలని పిలుపు ఇవ్వలేదని, కేవలం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.