వైద్యో నారాయణో హరి అంటారు. అయితే అలాంటి వైద్య వృతిని నిర్వహిస్తున్న ఓ మహిళ డాక్టర్‌ను ఆమె వద్ద చికిత్స పొందుతున్న వ్యక్తే అతి దారుణంగా హత్య చేశాడు. 

వైద్యో నారాయణో హరి అంటారు. అయితే అలాంటి వైద్య వృతిని నిర్వహిస్తున్న ఓ మహిళ డాక్టర్‌ను ఆమె వద్ద చికిత్స పొందుతున్న వ్యక్తే అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కేరళలోని కొల్లంలోని కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా డాక్టర్‌ను 23 ఏళ్ల వందన దాస్‌గా గుర్తించారు. వివరాలు.. కొట్టాయంకు చెందిన వందన దాస్.. ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. అయితే నెడుంబన‌లో టీచర్‌గా పనిచేస్తున్న సందీప్‌ తన ఇంటి వద్ద గొడవ పడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ జరిగిన గొడవలో సందీప్‌కు గాయాలు కావడంతో తెల్లవారుజామున కొట్టారకరలోని తాలూకా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ సందీప్ కాలుకు గాయానికి వందన డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే సందీప్ ఒక్కసారిగా వందనపై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్సకు ఉపయోగించే పరికరాలతో విరుచుకుపడ్డాడు. కత్తెర‌, ఇతర పరికరాలతో వందనపై ఐదుసార్లు పొడిచాడు. ఆసుపత్రిలో ఉన్న వారిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో పరిస్థితి విషమించడంతో వందన కన్నుమూసింది. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిందితుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్టుగా చెబుతున్నారు. 

Also Read: భారత ప్రధాని మోదీపై ఫిర్యాదు చేయాలన్న పాక్ నటి.. ఢిల్లీ పోలీసుల అదిరిపోయే రిప్లై.. నెటిజన్ల ప్రశంసలు..

Also Read: Karnataka Election 2023: చిక్కమగళూరులో పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు వేసిన వధువు..

ఈ ఘటనపై కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలునిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. హౌస్ సర్జన్‌లు కూడా స్ట్రైక్‌లో పాల్గొంటారని తెలిపింది. ఇక, కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో మొత్తం సేవలను నిలిపివేశారు. వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు.