Margaret Alva: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఈ క్రమంలోనే జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలో ఉండగా, అధికార ఎన్డీయే కూటామి తమ అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ దంకర్ పేరును ప్రతిపాదించింది.
Vice Presidential election: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి కోసం నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం సైతం వచ్చే నెలలో ముగియనుంది. ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలో ఉండగా, అధికార ఎన్డీయే కూటామి తమ అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ దంకర్ పేరును ప్రతిపాదించింది. ఇదివరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ కూటమిలోని ఎన్డీయే ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఆమెకు శివసేన మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ఇదివరకే ప్రకటించారు.
అయితే, ఉపరాష్ట్రపతి కోసం జరిగే ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని శివసేన ప్రకటించింది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు శివసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ ఆదివారం నాడు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ కూటమి గిరిజన సమూహానికి చెందిన ద్రౌపది ముర్ము బరిలో నిలిపింది. ఇదే విషయాన్ని శివసేన వెల్లడిస్తూ.. ముర్ము గిరిజన మహిళ, మహారాష్ట్రలో గిరిజనులు ఎక్కువగా ఉన్న సెంటిమెంట్ కారణంగా సేన ద్రౌపది ముర్ముకి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
సంజయ్ రౌత్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ద్రౌపది ముర్ము ఒక మహిళ.. గిరిజన సమాజానికి చెందినది.. మహారాష్ట్ర ఎక్కువగా గిరిజనులు.. మన ఎంపీలు, ఎమ్మెల్యేలలో చాలా మంది గిరిజనులు.. ద్రౌపది ముర్ముతో ఒక సెంటిమెంట్ ఉంది.. మా పార్టీ నాయకులకు కూడా ద్రౌపది ముర్ము గురించి మద్దతు విషయాన్ని వెల్లడించారు. అందుకే శివసేన ఏన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తోంది. అయితే శివసేన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తుంది" అని ఆయన అన్నారు.
అంతకుముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల అభ్యర్థిని నిర్ణయించడానికి ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ(ఎం), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), శివసేన, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సహా 17 ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్ద సమావేశమయ్యారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాలని నిర్ణయించారు. "మమతా బెనర్జీ ఆన్-బోర్డ్ మీటింగ్‌లో బిజీగా ఉన్నారు. దాని కారణంగా ఆమె సమావేశానికి హాజరు కాలేదు, కానీ నేను ఆమెతో టచ్‌లో ఉన్నాను. దీని గురించి ముందే చర్చ జరిగింది" అని పవార్ అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు మలికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. "ఈ రోజు (ఆదివారం) ప్రతిపక్ష అభ్యర్థులను నిర్ణయించారు. అయితే మమతా బెనర్జీ ఒక సమావేశంలో బిజీగా ఉన్నారు. దాని కారణంగా చర్చలు జరగలేదు. అయితే శరద్ పవార్ మమతాజీతో టచ్‌లో ఉన్నారు" అని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, టీఆర్‌ఎస్ నుంచి కేకే ఉన్నారు. ఆర్జేడీ నుంచి ఏడీ సింగ్, శివసేన నుంచి సంజయ్ రౌత్, కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, మలికార్జున్ ఖర్గే, ఐయూఎంఎల్ నుంచి ఈటీ మహ్మద్ బషీర్, ఎండీఎంకే నుంచి వైకో, డీఎంకే నుంచి టీఆర్ బాలు, వీసీకే నుంచి తిరుచ్చిశివ సమావేశానికి హాజరయ్యారు. సీపీఐ నుంచి తిరుమావళవన్, రవికుమార్, డి రాజా, బినోయ్ బిస్వామ్, కేరళ కాంగ్రెస్(ఎం), నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.
