రామాయణ, మహాభారతాలు హింసతో నిండి ఉన్నాయన్న సీతారాం ఏచూరి వ్యాఖ్యలు దుమారాన్ని రేపతున్నాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. హిందూ ధర్మంపై నమ్మకం లేనప్పుడు ఆయనకు సీతారాం అనే పేరేందుకని.. బాబర్, ఔరంగజేబు, చెంగిజ్‌ఖాన్‌గా మార్చుకుంటే బాగుంటుందని సూచించారు.

రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండటానికి అనర్హులని సంజయ్ వ్యాఖ్యానించారు. హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటని సంజయ్ ప్రశ్నించారు.

రామాయణం, మహాభారతాలు ఒకే సందేశాన్నిస్తున్నాయన్నారు. ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందని.. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలని సంజయ్ స్పష్టం చేశారు.

రామయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్‌పై సైన్యం పోరాటాన్ని కూడా హింసాత్మకం అంటారాని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ యోగా గురువు బాబా రామ్‌దేవ్ హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఏచూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోపాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీతారాం ఏచూరి.. రామాయణ, మహాభారతాలు రెండు కూడా యుద్ధాలతో పాటు హింసాత్మక ఘటనలతో నిండి వున్నాయన్నారు.  

హిందువులు హింసను ప్రొత్సహించేవారు కాదని హిందూ ప్రచార వాదులు చెప్పగలరా అని సీతారాం ప్రశ్నించారు. హిందువుల ఓట్ల కోసమే బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొన్న సాధ్విని పోటీలోకి దింపిందని ఆయన ఆరోపించారు.