కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ మద్యం షాపులకు అనుమతులివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం తీసుకుంటున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలపై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 

ఎవరైనా మనిషి చనిపోతే... అంత్యక్రియలకు హాజరవ్వడానికి కేవలం 20 మందికి మాత్రమే అనుమతులిస్తున్నారని, అదే మందుషాపుల వద్ద మాత్రం వేల మంది గుమికూడుతున్నా పట్టడం లేదా అని ఆయన ఎద్దేవా చేసారు.   

మనిషి శరీరాన్ని "స్పిరిట్" వదిలేసింది కాబట్టి కేవలం 20 మందిని మాత్రమే అంత్యక్రియలకు అనుమతిస్తున్నారని, అదే మద్యం షాపుల్లో "స్పిరిట్" ఉన్నందున అక్కడ వేల మందిని గుమికూడదానికి అనుమతిస్తున్నట్టు ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. 

కేంద్రం గతంలో అంత్యక్రియలకు 20 మంది, పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతులిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధింగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.

ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.

గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 19,089కి చేరుకుంది. శుక్రవారంనాడు కొత్దగా 1,089 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 731కి చేరుకుంది.