భారతదేశంలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. మొదట్లో రోజూ వందల్లో బయటపడే కేసులు ఇప్పుడు వేలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్, ముంబై, ఢిల్లీలో వైరస్ వ్యాప్తి చెందడానికి ఫిబ్రవరిలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ అమెరికాకు చెందిన ప్రతినిధులు, అధికారులు పర్యటించారని.. వీరి నుంచే వైరస్ వ్యాప్తి జరిగిందని సంజయ్ మండిపడ్డారు.

Also Read:ఆర్ధిక వ్యవస్థ పుంజుకొంటుంది, కరోనాపై పోరుకు కొత్తదారులు: మోడీ

మోడీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్ విధించి.. ఇప్పుడు సడలింపుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పడేసిందని ఆయన విమర్శించారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో విఫలమయ్యారనే సాకుతో ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

అయితే తాము బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా వైరస్ సాకుతో రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటే బీజేపీ అధికారంలో ఉన్న వాటితో సహా 17 రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:ఇండియాపై కరోనా పంజా: 24 గంటల్లో 8,380 కేసులు, మొత్తం 1.8లక్షలకు చేరిక

కోవిడ్ 19ను కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని.. మహమ్మారిపై పోరుకు ఓ ప్రణాళికే లేకుండా పోయిందని సంజయ్ దుమ్మెత్తి  పోశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఏ విధంగా విఫలమయ్యిందో రాహుల్ చక్కగా విశ్లేషించారని తెలిపారు. కాగా మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడంలో ఉద్ధవ్ సర్కార్ విఫలమైందని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని ఇటీవల బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే.. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరిన సంగతి తెలిసిందే.