ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేని బీజేపీ ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అయితే ఎన్డీఏలోని కొన్ని పార్టీలు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మద్ధతు ప్రతిపక్షాల అభ్యర్థికేనని తెలపగా.. శిరోమణి అకాలీదళ్, శివసేన ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఎన్డీఏ డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్ధిగా జేడీయూ ఎంపీ హరివాన్ష్‌ను బరిలోకి దింపడంపై శిరోమణి అసంతృప్తి వ్యక్తం చేసింది.

ముందుగా ఆ పదవికి తమ పార్టీ అభ్యర్థి నరేశ్ గుజ్రాల్‌ను అనుకున్నారని.. అందుకు నరేశ్ మానసికంగా సిద్ధమయ్యారని.. కానీ  ఇప్పుడు అకస్మాత్తుగా జేడీయూ అభ్యర్థిని రంగంలోకి దించారని.. దీనిపై తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అకాళీదళ్ బీజేపీపై మండిపడుతోంది.

ఇక మొదటి నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్న శివసేన యధావిధిగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రంగంలోకి దిగారు. తమ పార్టీ అభ్యర్థికి మద్ధతు తెలపాల్సిందిగా నితీశ్ పలువురు పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.