Asianet News TeluguAsianet News Telugu

మార్పు కోరుకుంటే నాకు ఓటేయ్యండి... కాంగ్రెస్ సభ్యులకు శశిథరూర్ పిలుపు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలనుకునేవారు తనకు ఓటు వేయాలని ఆయన కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో శశిథరూర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎన్ త్రిపాఠిలు కూడా శుక్రవారం నామినేషన్‌లు దాఖలు చేశారు

shashi tharoor sensational comments on congress presidential election
Author
First Published Oct 1, 2022, 8:46 PM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఊహాకందని ట్విస్టులు, రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను, ఖర్గే భిన్న దృక్పథాలకు చెందినవారమని.. మా ఇద్దరి మధ్యా జరుగుతున్న పోటీని ఓ యుద్ధం అని భావించొద్దన్నారు. తమలో విజేత ఎవరన్నది కాంగ్రెస్ సభ్యులు నిర్ణయిస్తారని థరూర్ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రస్తుత పరిస్ధితులపై సంతృప్తి చెందితే ఖర్గేకు ఓటు వేయాలని.. ఒకవేళ మార్పు కోరుకుంటున్నట్లయితే తనకు ఓటేయాలని శశిథరూర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలో మార్పు తీసుకొచ్చేందుకు తాను సిద్ధంగానే వున్నానని ఆయన స్పష్టం చేశారు. 

ఇకపోతే.. శశిథరూర్ మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే అందులో ప్రచురించిన ఇండియా మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లఢఖ్ లేవు. దీనిపై పెనుదుమారమే రేగింది. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. దీనిపై తక్షణం స్పందించిన శశిథరూర్ అందరికీ క్షమాపణలు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. వాలంటీర్ల బృందం పొరపాటు చేసిందని వివరణ ఇచ్చారు. వెంటనే దీనిని సవరించామని.. జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు శశిథరూర్. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన మేనిఫెస్టో కాపీలను ట్వీట్ చేశారు. 

ALso REad:గాంధీ ఆశీస్సులతో ‘అధికారిక అభ్యర్థి’గా మల్లికార్జున్ ఖర్గే!.. శశిథరూర్ మరో జితేంద్ర ప్రసాదానేనా?

అయితే శశిథరూర్ ఇండియా మ్యాప్‌కు సంబంధించి తప్పు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 డిసెంబర్‌లో భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్న సమయంలోనూ ఓ ట్వీట్ చేసి అందులోనూ ఇలాంటి తప్పు చేశారు . దీనిపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు విరుచుకుపడటంతో థరూర్ వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేశారు. 

కాగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో శశిథరూర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎన్ త్రిపాఠిలు కూడా శుక్రవారం నామినేషన్‌లు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోటీలో ఒకరికి మించి అభ్యర్థులు వున్న పక్షంలో అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి.. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే కెఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన నామినేషన్‌ శనివారం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యింది. దీంతో ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఎంపీ శశిథరూర్‌ మధ్య పోటీ ఉండ‌నుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios