మేమంతా ఏకతాటి మీదికి వచ్చాం అని రాహుల్ గాంధీ ఈ రోజు శరద్ పవార్‌తో సమావేశం తర్వాత అన్నారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో రాహుల్ గాందీ, మల్లికార్జున్ ఖర్గేలతో శరద్ పవార్ గురువారం సాయంత్రం సమావేశం అయ్యారు. విపక్షాల ఐక్యత గురించి చర్చించారు.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాల ఐక్యత గురించిన చర్చ పెరిగిన సంగతి తెలిసిందే. కానీ, అందుకు సంబంధించిన కార్యచరణ మాత్రం పెద్దగా జరగలేదు. అయితే, ఈ వారం వ్యవధిలోనే విపక్షాల ఐక్యత చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నితీశ్ కుమార్ ఇతర పార్టీల నేతలతోనూ సమావేశాలు జరిపారు. తాజాగా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో విపక్షాల ఐక్యత గురించి చర్చించారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో గురువారం సాయంత్రం ఆయన వీరితో సమావేశం అయ్యారు.
ఈ సమావేశం తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ, ‘అన్ని విపక్ష పార్టీల నేతలతో చర్చలు జరగాలి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్.. మనమంతా వారి వద్దకు వెళ్లి వారితో మాట్లాడాలి. అందరినీ కలుపుకునే ముందుకు పురోగమిద్దాం. వారిందరితోనే విపక్షాల ఐక్యతను ఏర్పాటు చేద్దాం’ అని శరద్ పవార్ అన్నారు.
Also Read: ఆయుధాలకు కొదవలేదు.. పాక్ ఐఎస్ఐతో డైరెక్ట్ లింకులు: అతీక్ అహ్మద్ పై యూపీ పోలీసు చార్జిషీట్
మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ‘ముంబయి నుంచి మాకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి శరద్ పవార్ తమ వద్దకు వచ్చినందుకు చాలా సంతోషం. నిన్ననే నేను, రాహుల్ గాంధీ.. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లతో చర్చించాం. దేశంలోని విపక్షాలన్నింటినీ ఐక్యంగా ఉంచుతామని మాట్లాడుకున్నాం’ అని వివరించారు.
‘నేడు ఈ దేశంలో జరుగుతున్న ఘటనలను ఎదుర్కోవడానికి మేమంతా కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, వాక్ స్వాతంత్ర్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిపైనా పోరాడతాం’ అని తెలిపారు.
మేమంతా కలిసి ఉన్నాం అని రాహుల్ గాంధీ అన్నారు. 2024 మే నెలలోపు సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
