Asianet News TeluguAsianet News Telugu

ప్రధానిని ప్రస్తావిస్తూ బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై ప్రశ్నలు.. మోడీపై శరద్ పవార్ విమర్శలు

ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శలు కురిపించారు. ఆయన ఒకవైపు ఆగస్టు 15 ప్రసంగంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని మాట్లాడుతారని, మరో వైపు ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లో బిల్కిస్ బానోపై అఘాయిత్యాలకు పాల్పడ్డ 11 మంది రేపిస్టులు, హంతకులను విడుదల చేశారని పేర్కొన్నారు.

sharad pawar cites pm modis independece day celebration speech,   questions bilkis bano case convicts release
Author
First Published Sep 11, 2022, 6:00 AM IST

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశ్నలు గుప్పించారు. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడాన్ని ఎత్తిచూపుతూ ప్రధానిపై విమర్శలు సంధించారు. 11 మంది రేపిస్టులను, హంతకులను విడుదల చేయడం విని తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని, అదే విధంగా అదే రోజు మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడాన్ని పోల్చారు. 

ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు గౌరవం ఇవ్వాలని మాట్లాడుతారని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో 2002 అల్లర్లలో సోదరి సమాన బిల్కిస్ బానో, ఆమె పిల్లలు దారుణాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆమె కుటుంబ సభ్యులు హత్యలకు గురయ్యారని వివరించారు. అదే రాష్ట్రంలోని బీజేపీ ఆ దారుణాలకు తెగబడ్డ వారికి పడిన శిక్షను కుదిస్తుందని విమర్శలు చేశారు.

దీని ద్వారా బీజేపీ.. ఈ దేశానికి, ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేసిందని, అది మహిళలకు ఏ విధమైన గౌరవం ఇస్తుందో స్పష్టం అయిందని విమర్శించారు.

గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్, బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు సహా ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చినందుకు గాను 11 మందికి యావత్ జీవిత కారాగార శిక్ష పడింది. వీరు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. కానీ, గుజరాత్ ప్రభుత్వ సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే పాలసీ ఆధారంగా వారిని ఆగస్టు 15వ తేదీన గోద్రా జైలు నుంచి విడుదల చేశారు. 

గత నెల 29వ తేదీన థానేలో జరిగిన ఓ విలేకరులో సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ తీస్తా సెతల్వద్ ప్రస్తావన తెచ్చారు. 2002 గుజరాత్ అల్లర్లపై తప్పుడు సాక్ష్యాల ఆధారంగా కేసులు పెట్టారని గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేసింది. తీస్తా సెతల్వాద్ అరెస్టునూ శరద్ పవార్ ప్రశ్నించారు. 

రెండు నెలలపాటు జైలులో ఉన్న తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios