బర్మేర్‌: రాజస్థాన్ లోని బర్మేరు జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మనుషుల ప్రాణాల కన్నా సెల్ఫీలు తీసుకోవడం వారికి ముఖ్యమై పోయింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి పరోక్షంగా వారు కారణమయ్యారు.

 గుజరాత్‌కు చెందిన పర్మానంద్‌, చంద్రారామ్‌, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు లేబర్‌ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో పని చేసేందుకు కార్మికులు అవసరం ఉండటంతో రాజస్థాన్‌లోని బర్మేర్‌కు వచ్చారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వీరిని స్కూలు బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. 

ఆస్పత్రికి తీసుకెళ్లి తమ ప్రాణాలను కాపాడాలని రోడ్డుపై వెళ్తున్న వారితో మొరపెట్టుకున్నారు. అయితే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితులతో సెల్ఫీలు దిగుతూ, వీడియోలు షూట్‌ చేస్తూ ఉండిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.