Asianet News TeluguAsianet News Telugu

యాక్సిడెంట్ కాదు ఉద్దేశపూర్వకమే.. ఢిల్లీ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో ప్రత్యక్షసాక్షి సంచలన విషయాలు..

కారుతో స్కూటీని ఢీ కొట్టి.. యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన ఘటన ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. ఆమెను గంటన్నరపాటు.. 18నుంచి 20 కి.మీ. లు లాక్కెళ్లి ఉంటారని తెలిపాడు. 

Sensational things come to light in the incident of Delhi young woman death in new year morning
Author
First Published Jan 3, 2023, 8:30 AM IST

ఢిల్లీ : నూతన సంవత్సరం వేళ ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. స్కూటీని ఢీకొట్టిన ఓ కారు దాన్ని నడుపుతున్న యువతిని.. కొన్ని కిలోమీటర్ల దూరం అలాగే లాక్కెళ్లడంతో ఆమె మరణించింది. అయితే మొదట దీన్ని ప్రమాదంగా పరిగణించారు. తాగిన మత్తులో చేసిన పొరపాటు అనుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి నడిరోడ్డులో నగ్న స్థితిలో కనిపించింది. అయితే అది పొరపాటు కాదని..  ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటన అని ఓ ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు వెలుగులోకి వచ్చింది.

దీపక్ దహియా లాడ్‌పూర్ గ్రామంలోని కంఝవాలా రోడ్డులో మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. అతను ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి. చెప్పిన వివరాల ప్రకారం.. “ఉదయం 3:20 అయ్యింది...నేను షాపు బయట నిలబడి ఉండగా 100 మీటర్ల దూరంలో వాహనం నుండి పెద్ద శబ్ధం వినిపించింది. అంతకు ముందు టైరు పగిలిందని అనుకున్నాను. కారు కదిలిన వెంటనే ఒక మృతదేహం కనిపించింది. దాన్ని వాళ్లు అలాగే ఈడ్చుకెళ్లారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను" అని దహియా తెలిపారు.

కొంత సమయం తరువాత, తెల్లవారుజామున 3:30 గంటలకు, కారు యు-టర్న్ తీసుకుందని, మహిళ మృతదేహం వాహనం కింద ఇరుక్కుపోయిందని అతను చెప్పాడు. నిందితులు దాదాపు 4-5 కిలోమీటర్ల రోడ్డుపై యూటర్న్‌లు తీసుకుని పదే పదే తిరిగారని దహియా తెలిపారు. "నేను చాలాసార్లు వారిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ వారు వాహనాన్ని ఆపలేదు, సుమారు గంటన్నర పాటు వారు మహిళ మృతదేహాన్ని సుమారు 20 కి.మీ.ల వరకు లాక్కెళ్లారు.

ప్రదీప్ తన బైక్‌తో కారును వెంబడించానని, పోలీసులతో లైన్లో ఉంటూనే వారిని ఫాలో అయ్యానని చెప్పారు. సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుండి మృతదేహం పడిపోయిందని, ఆ తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు. "ఇది కేవలం ప్రమాదం కాదు" అని ప్రదీప్ నొక్కి చెప్పాడు.ఇది ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. 

న్యూ ఇయర్ సందర్భంగా రోడ్డులో ఏర్పాటు చేసిన బారికేడ్లను చూసి కార్ యూటర్న్ తీసుకోవడం.. తాను ప్రత్యక్షంగా చూసినట్టు ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా తెలిపాడు. దీంతోపాటు బాధితురాలిని నిర్దాక్షిణ్యంగా కారుతో లాక్కెడుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఢిల్లీలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు బాధితురాలిపై హత్యాచారం జరిగిందని.. దానిని పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సుల్తాన్పూర్ పోలీస్స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. 

స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. న్యూ ఇయర్ రోజే ఘటన

రహదారులను దిగ్బంధం చేశారు. ఎల్జీ నివాసం ఎదుట ఆప్ నేతలు కూడా నిరసనకు దిగారు. కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. ఈ ఘటన మీద పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని తెలపాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

నిందితుల్లో బీజేపీ నేత
ఈ ఘటనను  ఆప్ చాలా సీరియస్ గా తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇంటి దగ్గర ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలతోపాటు 200 వందల మంది నేతలు నిరసనకు దిగారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ఐదుగురిలో..  మనోజ్ మిత్తల్ కూడా ఒకరు అని.. అతను బీజేపీ నేత అని ఆప్ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ దారుణమైన ఘటన అత్యంత అరుదైన నేరం అన్నారు. ఈ ఘటన మీద లెఫ్టినెంట్ గవర్నర్ తో మాట్లాడానని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఘటనకు పాల్పడిన నిందితులను..  అత్యంత కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు. 

ఎల్జి సక్సేనా దీనిమీద స్పందిస్తూ.. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. తలకొట్టేసినట్టుగా అయిందని.. ఈ అమానవీయ ఘటనపై పోలీసులతో మాట్లాడానని ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై కేంద్ర హోం శాఖ కూడా స్పందించింది. ఈ అమానవీయ ఘటన మీద  ఢిల్లీ పోలీసులు సమగ్ర నివేదిక సమర్పించాలని హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు పూర్తి చేయడానికి  ఢిల్లీ పోలీసు విభాగం షాలిని సింగ్ ను ప్రత్యేక కమిషనర్గా నియమించింది. 

ఆమె నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. బాధితురాలు అంజలి మృతదేహానికి ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి నిందితుల మీద మరిన్ని కేసులు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనకు కారణమైన ఐదుగురు నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టగా.. వారికి మూడు రోజుల రిమాండ్ కోర్టు విధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios