Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేగింది. గత ఏడాది కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఎమ్మెల్యేల మద్దతు లేదని ఆ పార్టీ నేత సునీల్ జాఖర్ ఆరోపించారు. అయినా.. చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం చేశారని ఆరోపించారు
Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోన్నాయి. ఓ వైపు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు చేస్తుంటే.. మరోవైపు.. సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు పుటుతున్నాయి. ఈ పరిణామాలు ప్రధానంగా.. అధికార కాంగ్రెస్ లో కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు గానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి గానీ ఎమ్మెల్యేల మద్దతు లేదని ఆ పార్టీ నేత సునీల్ జాఖర్ సంచలన ఆరోపణలు చేశారు.
అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇచ్చారని పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సునీల్ జాఖర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సమయంలో సునీల్ జక్కర్ ఈ విధంగా గళమెత్తారు. ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది.
సునీల్ జక్కర్ మాట్లాడుతూ.. గత ఏడాది కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలో తెలియజేయాలని పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ పార్టీ అధిష్ఠానం అడిగిందని, ఈ సమయంలో తనకు అనుకూలంగా 46 మంది ఎమ్మెల్యేలు, సుఖ్‌జిందర్ రణధవాకు 16 మంది, ప్రణీత్ కౌర్‌కు 12 మంది, నవజోత్ సింగ్ సిద్ధూకు ఆరుగురు, (చరణ్‌జిత్ సింగ్) చన్నీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారన్నారని సునీల్ అన్నారు.
సునీల్ అబోహర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నపుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనకు సీఎం పదవి లభించకున్నా.. చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందనీ, ఈ విషయం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే.. అనధికారంగా కాంగ్రెస్ పార్టీ చన్నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. సుఖ్జీందర్ సింగ్ రంధావా ముఖ్యమంత్రి అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోందనీ, ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘనపై చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని జాఖర్ విమర్శించారు.
అదే సమయంలో, కాంగ్రెస్ తమకు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలో ప్రజల స్పందన పొందడానికి టెలివోటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ టెలి ఓటింగ్ పెట్టి.. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. "ఇది కాంగ్రెస్ కి కొత్త కాదు. నెహ్రూజీ (కాంగ్రెస్) చీఫ్ అయినప్పుడు, అందరూ (సర్దార్ వల్లభాయ్) పటేల్ జీకి మద్దతు ఇచ్చారు. అయినా.. నెహ్రునే ప్రధానిగా చేశారు. అప్పుడు పటేల్ జీని గౌరవించకపోయింది. జఖర్ జీ మీరేలా ఆశించగలరని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు మీనాక్షి లేఖి ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
