సెల్ఫీ పిచ్చి.. ఐదుగురిని కటకటాలు లెక్కపెట్టేలా చేసింది. సోషల్ మీడియాలో లైక్ లు, కామెంట్ల కోసం వారు చేసిన పని.. వారినే సమస్యల్లోకి నెట్టేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రాజనాగం పాముతో సెల్ఫీ తీసుకున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కూడలూర్‌ సమీపకన్నంపయల్‌ రోడ్డులో 4వ తేదీ కొందరు ఓ చెట్టుపై నుంచి రాజనాగం పామును పట్టుకుని దాంతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మణికంఠన్‌, రామానుజం, దినేష్‌కుమార్‌, యుగేశ్వరన్‌, విఘ్నేష్‌ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో వీరు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.