Asianet News TeluguAsianet News Telugu

రంజాన్ మాసంలో ముస్లింలను నిద్రలేపే సాంప్రదాయాన్ని కాపాడుతున్న సేహ్రి ఖాన్‌లు.. వారి చరిత్ర ఇదీ

రంజాన్ మాసంలో ప్రార్థనలు చేయాల్సిన ముస్లింలను తెల్లవారుజామున నిద్ర లేపేవారిని సేహ్రి ఖాన్‌లు అంటారు. వీరు తెల్లవారుజామున ముస్లింలను లేపి సేహ్రి (సూర్యోదయానికి ముందటి భోజనం) తయారు చేసుకోవడానికి, ప్రార్థనలకు సిద్ధం కావడానికి నిద్రలేపుతారు. ఈ సంప్రదాయం పలు దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నది.
 

sehri khans keeping islamic tradition alive, they wakes up muslims during ramzan period kms
Author
First Published Mar 27, 2023, 5:18 PM IST

న్యూఢిల్లీ: రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలు సూర్యోదయానికి ముందు చేసే భోజనం కోసం, ఉదయం ప్రార్థనల కోసం ప్రత్యేకంగా నిద్రలేపే వారు ఉంటారు. వారిని సేహ్రి ఖాన్‌లు అంటారు. మధ్యప్రాఛ్య, అరబ్ రీజియన్‌లోని ప్రజలు వారిని మాసాహరతీలు అంటారు. వీరినే భారత్, దక్షిణాసియా రీజియన్‌లో సేహ్రి ఖాన్ అని పిలుస్తారు. 

ఇలా ఉపవాసమున్న వారిని తెల్లవారుజామున లేపడం ప్రాచీన ముస్లిం సంప్రదాయం. ఇప్పుడు ఉదయం పూట నిద్ర లేవడానికి ఎన్నో సదుపాయాలు టెక్నాలజీ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇలా ఉదయమే లేపడాన్ని ముస్లిం ప్రజలు చరిత్రను పునర్దర్శించుకోవడం, ముస్లిం ఆచారాన్ని కాపాడుకోవడం అనే కోణం నుంచి చూస్తున్నారు. అయితే, టెక్నాలజీ సవాళ్లు లేవనే మాట అర్థసత్యమే అవుతుంది.

రంజాన్ కాలంలో సేహ్రి ఖాన్‌లు స్థానిక పాటలు పాడుతూ డ్రమ్‌లు కొడుతూ ఉపవాసమున్న వారిని తెల్లవారుజామున నిద్రలేపుతారు. వారిని సేహ్రి (సూర్యోదయానికి ముందు భోజనం) ప్రిపేర్ చేసుకోవడానికి లేపుతారు.

మధ్యప్రాఛ్య దేశాలు, టర్కీ, ఈజిప్టు వంటి దేశాల్లో ఈ సంప్రదాయం సుస్థిరంగా ఉన్నది. ఇందుకోసం వారు ప్రత్యేక అరేంజ్‌మెంట్లు చేసుకున్నారు.

2 ఏహెచ్(మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మసీదుకు ప్రయాణం మొదలు పెట్టినకాలాన్నే ఏహెచ్‌గా పిలుస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఆయన ప్రయాణం క్రీ.శ. 622లో ప్రారంభమైంది.) సంవత్సరంలో ఉపవాసం తప్పనిసరి అయినప్పుడు ఉదయం పూట నిద్ర లేపడం కూడా చాలా అవసరం భావన వచ్చింది. అప్పుడే ఈ ఆచారం మొదలైంది. వారు కర్రలు కాలుస్తూ పట్టణాల్లో తిరుగుతూ ప్రజలు సేహ్రి కోసం నిద్రలేపుతుండేవారు. తొలుత ఇది మదీనాలో పాపులర్ అయింది. అనంతరం, ఇతర దేశాలకూ వ్యాపించింది. అరేబియాలో ఆ తర్వాత ఇస్లామిక్ వరల్డ్ మొత్తంలో ఈ సాంప్రదాయం ఆచరణలోకి వచ్చింది.

మక్కాలో వీరిని జాంజామి అని పిలుస్తారు. చేతిలో లాంథర్లు పట్టుకుని నడుస్తూ చప్పుళ్లతో నిద్రలేవని వారిని లేపుతుంటారు. సూడాన్‌లో ఈ మాసాహరతీలు ఓ పిల్లాడిని వెంటేసుకుని వీధుల్లో తిరుగుతారు. ఎవరినైతే ప్రార్థనల కోసం నిద్ర లేపాల్సి ఉన్నదో వారి ఇంటి ఎదుట ఇద్దరు నిలబడి అల్లా గురించి పాట పాడుతూ డ్రమ్స్ కొడతారు. ఇలా చేసే వారికి జీతమంటూ ఏదీ ఉండదు. కానీ, రంజాన్ మాసం చివరిలో ముస్లింలు వారికి ఏదైనా రూపంలో బహుమానాలు ఇస్తారు. 

Also Read: మియో కమ్యూనిటీ కోసం మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రారంభించనున్న యూసుఫ్ ఖాన్

టర్కీలో ఇలా డ్రమ్స్‌ వాయిస్తూ నిద్రలేపే ఆచారం ఇంకా సజీవంగా ఉన్నది. టర్కీ సంస్కృతిలో ఇదొక భాగమైంది. రంజామ్ చంద్రుడు కనిపించగానే వాలంటీర్లు మసీదు ప్రాంగణంలో చేరి సాంప్రదాయ దుస్తులు ధరించి డ్రమ్స్ వాయిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒట్టోమాన్ కాలిఫేట్ కాలంలో ఈ ఆచారం టర్కీలో వచ్చింది. నేటి ఆధునిక టర్కీ దేశంలోనూ ఈ ఆచారాలు దాదాపు అధికారికంగానే నిర్వహిస్తున్నారు. 

ఈజిప్టులోనైతే ఆశ్చర్యకర సంగతి ఒకటి ఉన్నది. అక్కడ ఒకానొక కాలంలో స్వయంగా రాజే తెల్లవారుజామున ముస్లింలను నిద్రలేపేవారు. ఆ పాలకుడిని ఉత్బా ఇబ్న్ ఇషాక్‌గా చరిత్ర గుర్తు పెట్టుకుంది. 

ఇండియా, పాకిస్తాన్‌లలోనూ ఇలా తెల్లవారుజామున పాటలు పాడుతూ, స్తుతి చేస్తూ నిద్రలేపే షరాబులు ఉన్నారు. కానీ, వారి సంఖ్య తగ్గిపోతున్నది.

-మన్సూరుద్దీన్ ఫరీది

Follow Us:
Download App:
  • android
  • ios