బీహార్ కు చెందిన సీమా యాక్సిడెంట్ లో ఒక కాలును పోగొట్టుకుంది. అయినా ఆమె ఒంటి కాలుతోనే గెంతుతూ స్కూల్ కు వెళ్లేది. అయితే సీమా స్కూల్ కు వెళ్తున్న తీరు వారం కిందట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దాతలు ఆమెకు ప్రొస్థెటిక్ లెగ్ ను ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాను మనం ఏ రకంగా ఉపయోగిస్తే అది అదే విధంగా మనకు ఉపయోగపడుతుందని అని చెప్పడానికి ఇదో ఉదాహరణ. సోషల్ మీడియాతో నష్టాలే కాకుండా ఇలా లాభాలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఇదో సందర్భం. అవును.. ఇది నిజంగా అందరూ చర్చింకోవాల్సిన విషయం. సోషల్ మీడియా పుణ్యమా అని ఓ పేద చిన్నారి ఇప్పుడు సౌకర్యవంతంగా బడికి వెళ్లబోతోంది. పైగా రెండు కాళ్లపై నిలబడి, తోటి పిల్లలతో కలిసి ఆడుకోనుంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బీహార్ కు చెందిన సీమాకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ?
సీమా నువు గ్రేట్.. ఒంటి కాలుతో గెంతుతూ స్కూల్ కు వెళ్తున్న పదేళ్ల బాలిక.. ఢిల్లీ సీఎం ప్రశంసలు
బీహార్ లోని జమూయి జిల్లాకు చెందిన 10 ఏళ్ల సీమాకు చదువంటే ప్రాణం. ఆమెకు రెండు సంవత్సరాల కిందట రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం నుంచి ఆమె అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. కానీ కాలును మాత్రం తొలగించాల్సి వచ్చింది. అయితే కాలును తొలగించారు గానీ ఆమెకు చదువుపట్ల ఉన్న శ్రద్దను మాత్రం పొగొట్టలేకపోయారు. ఆపరేషన్ జరిగి కొంత కాలం అయిన తరువాత ఆమెకు స్కూల్ కు వెళ్లడం ప్రారంభించింది. అయితే ఆ బాలిక ఇంటి నుంచి స్కూల్ కిలో మీటర్ దూరంలో ఉంటుంది. తల్లిదండ్రులు పేదవారే. ప్రతీ రోజు వారి జీవనం కొనసాగేందుకు పనులు చేసుకుంటారు. సీమాను స్కూల్ వద్ద దించి తిరిగి తీసుకురావడం వారికి కూడా ఇబ్బందే. అయితే సీమ ఎవరి సాయం తీసుకోకుండా తనకు ఉన్న ఒక్క కాలుతోనే స్కూల్ కు వెళ్లాలనుకుంది.
ఆమె ఒంటి కాలుతోనే గెంతుతూ ప్రతీరోజు స్కూల్ కు వెళ్లసాగింది. అయితే సీమా స్కూల్ కు వెళ్లే తీరును ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. అది వేలాది మందికి స్పూర్తిగా మారింది. ఎన్నో సౌకర్యాలు ఉన్న చదువు పట్ల శ్రద్ద కనబర్చని పిల్లలు ఉన్న ప్రస్తుత కాలంలో సీమా ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఈ వీడియో వారం కిందట వైరల్ మారడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆమె తెగువను ప్రశంసించారు. సీమాను అభినందించారు. ఈ వైరల్ వీడియోపై మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీంతో జముయి జిల్లా మేజిస్ట్రేట్ అవనీష్ కుమార్, పలువురు సీనియర్ అధికారులు స్పందించారు. సీమా ఉన్న ఫతేపూర్ గ్రామానికి వెళ్లి ఓ ట్రై సైకిల్ బహుమతిగా అందించారు.
కరోనా కాలంలో ఎంతో మందికి అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ సీమాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ‘‘ అబ్ యే అప్నే ఏక్ నహీ దోనో పైరోన్ పర్ కూడ్ కర్ స్కూల్ జాయేగీ. టికెట్ భేజ్ రహా హు, చలియే దోనో పైరోం పర్ చల్నే కా సమయ్ ఆ గయా హై ( ఇప్పుడు మీరు ఒక్క కాలుతో కాదు రెండు కాళ్లతో స్కూల్ కు వెళ్తారు. టిక్కెట్ పంపిస్తున్నాను. ఇక పదండి. మీరు రెండు కాళ్లపై నడిచే సమయం ఆసన్నమైంది’’ అంటూ ట్వీట్ చేశారు. తరువాత ఆమెకు ప్రొస్థెటిక్ లెగ్ ను ఏర్పాటు చేయించారు.
సీమాకు ప్రొస్థెటిక్ లెగ్ వచ్చిందని ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా ట్వీట్ చేశారు. ఆమె తన రెండు కాళ్లపై నిలబడి ఉన్న బాలికను పోస్ట్ చేసింది. "సోషల్ మీడియా #Seema సానుకూల శక్తి ఇది. ఆమె రెండు కాళ్లపై నిలబడింది ’’ అంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియా శక్తిని ప్రశంసించారు.
