త్రిపురలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భద్రతా లోపం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ఓ కారు వచ్చి చేరింది. గుర్తింపు లేని ఆ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కారు ఆగి వివరాలు చెప్పకుండానే తప్పించుకుని వెళ్లిపోయింది.
అగర్తలా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు త్రిపురలో భద్రతా లోపం ఏర్పడింది. నిన్న ఆయన ఈశాన్య రాష్ట్రం త్రిపురకు వెళ్లారు. త్రిపుర రాయల్ ప్రద్యోత్ మానిక్య దేబ్ బర్మను కలిసి మాట్లాడారు. బీజేపీతో తిప్రా మోతా కూటమిపై చర్చించారు. ఇటీవలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్ సాహాతోనూ అమిత్ షా భేటీ అయయ్యారు. ఇదంతా షెడ్యూల్‌లో ఉన్నవే. కానీ, ఆయన ఈశాన్య రాష్ట్ర పర్యటనలో అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గుర్తింపు లేని ఓ కారు ఆయన కాన్వాయ్‌లోకి చొచ్చుకుని వచ్చింది.
ఈ సెక్యూరిటీ లోపం కెమెరాలో రికార్డ్ అయింది. అగర్తలాలోని గెస్ట్ హౌజ్ నుంచి కేంద్ర హోం మంత్రి కాన్వాయ్ వెళ్లిపోతుండగా కాన్వాయ్ చివరలో ఓ తెల్లటి టాటా టిగోర్ కారు వచ్చి చేరింది. అమిత్ షా కాన్వాయ్‌లోని చివరి కారు వెనుక ఈ టాటా కారు వచ్చి చేరింది. అక్కడ ఆ కారు వెనుకాలే మరికొన్ని వీఐపీ కారులు ఫాలో కావాల్సి ఉన్నది.
Also Read: నాగాల్యాండ్‌లో బీజేపీ కూటమికి ఎన్సీపీ మద్దతు.. కమలం పార్టీకి సపోర్ట్ పై శరద్ పవార్ వివరణ ఇదే
ఇది గమనించిన పోలీసులు ఆ టాటా కారును ఆపడానికి ప్రయత్నించారు. అమిత్ షా కాన్వాయ్ ప్రయాణిస్తున్నందున ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు. కారు ఆపినట్టే ఆపి వివరాలు వెల్లడించకుండానే మళ్లీ తప్పించుకుని వెళ్లిపోయింది. పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.
