మావోయిస్టులతో  సంబంధాల  విషయంలో   ప్రొఫెసర్ సాయిబాబాను  నిర్ధోషిగా  ప్రకటిస్తూ   ముంబై  హైకోర్టు  ఇచ్చిన తీర్పును  సుప్రీంకోర్టు కొట్టివేసింది.  

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును బుధవారంనాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎంఆర్ షా, సిటి రవికుమార్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది.ప్రొఫెసర్ సాయిబాబా కేసును పునర్విచారించాలని సుప్రీంకోర్టు ముంబై హైకోర్టును ఆదేశించింది.సాయిబాబా సహా ఇతర నిందితులను అప్పీల్ ను డిశ్చార్జీ చేసిన బెంచ్ కాకుండా మరో బెంచ్ విచారించాలని ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

సాయిబాబా సహ ఇతర నిందితులను ఈ కేసులో నిర్ధోషులుగా ప్రకటిస్తూ గత ఏడాది అక్టోబర్ 15న ముంబై హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహరాష్ట్ర ప్రభుత్వం తరపున అభికల్ప్ ప్రతాప్ సింగ్, సాయిబాబా తరపున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ సుప్రీంకోర్టులో వాదించారు. 

ఉపా చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్లకు పైగా జైలులో ఆయన ఉన్నారు. అయితే గత ఏడాది అక్టోబర్ లో సాయిబాబాను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఆయనను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును నాగ్ పూర్ హైకోర్టు బెంచ్ లో సవాల్ చేశారు సాయిబాబా. సాయిబాబాతో పాటు మహేష్ కరిమాన్ టిర్కీ, పాండు పోరా నరోటే, హూమ్ కేశవదత్తా మిశ్రా, ప్రవాంత్ సాంగ్లికర్, విజయ్ తిర్కీలను ముంబై హైకోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.