Haryana Violence: హ‌ర్యానాలోని నుహ్ జిల్లాలో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సున్నిత ప్రాంతాల్లో అద‌న‌పు బ‌ల‌గాలను మోహ‌రించాల‌ని, సీసీటీవీల‌ను ఏర్పాటు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. 

Haryana Violence: హర్యానాలోని నుహ్‌లో జలాభిషేక్ యాత్ర సందర్భంగా హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఆరుగురు చనిపోయారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. నిందితులను అదుపులోకి తీసుకుని శాంతింపజేసేందుకు 20 కంపెనీల పారామిలటరీ బలగాలు, 20 కంపెనీల పోలీసు బలగాలను మోహరించారు. కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. 

పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అదే సమయంలో పల్వాల్, సోహానా, మనేసర్ , పటౌడీ వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదిలాఉంటే.. విశ్వహిందూ పరిషత్ ఈ హింసాత్మక ఘటనకు తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ సాత్మక ఘటనల దృష్ట్యా యూపీలోని 11 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి పైగా వ్యక్తులపై ముప్పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే.. నుహ్‌లో హింసాకాండ తర్వాత.. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే.. విహెచ్‌పి ర్యాలీలపై నిషేధించాలనే డిమాండ్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్పందించింది. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని కోర్టు పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల హింస జరగకుండా చూడాలి. సున్నితమైన ప్రాంతంలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అదనపు బలగాలను మోహరించండి. సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. ఈ మేరకు ఢిల్లీ, హర్యానా, యూపీ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు పంపింది.

వీహెచ్‌పీ కార్యక్రమాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించలేదు. ఆ కార్యక్రమాల వల్ల హింసాత్మక ప్రసంగాలు లేవని, హింస వ్యాప్తి చెందకుండా చూడాలని మాత్రమే రాష్ట్రాలను కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ శుక్రవారం (ఆగస్టు 4) జరగనుంది.