రూ. 2,000 నోట్లను మార్పిడి చేసుకునేటప్పుడు లేదా డిపాజిట్లు చేసేటప్పుడు ఎలాంటి ఐడీ ప్రూఫ్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఎలాంటి ప్రూఫ్‌లు చూడకుండానే ఈ పని చేసిపెట్టాలని అన్ని బ్రాంచ్‌లకు ఎస్‌బీఐ తాజా గైడ్‌లైన్లు ఇచ్చింది. 

న్యూఢిల్లీ: రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేటప్పుడు లేదా.. డిపాజిట్లు చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్లు, ఐడీ ప్రూఫ్‌లు అవసరమా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. దీని చుట్టూ అనేక వదంతులూ వచ్చాయి. వీటన్నింటికీ ఎస్‌బీఐ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు సంబంధించి ఎస్‌బీఐ బ్రాంచీలకు హెడ్ క్వార్టర్ నుంచి ఈ రోజు గైడ్‌లైన్స్ వెళ్లాయి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం, ఎలాంటి డాక్యుమెంట్లు, ఐడీ ప్రూఫ్‌లు లేకుండానే రూ. 2,000 డిపాజిట్లు లేదా మార్పిడి చేయాలని గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి. ఒక్కసారికి రూ. 20,000 విలువ వరకు రూ. 2,000 నోట్లను ఏకకాలంలో డిపాజిట్ చేయవచ్చని వివరించాయి.

రూ. 2,000 నోట్లు డిపాజిట్ చేసే టప్పుడు లేదా ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు కచ్చితంగా ఒక క్లారిఫకేన్ ఫాల్ నింపాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆధార్ కార్డు వంటి ఐడీ ప్రూఫ్‌లు అవసరం ఉంటాయని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. ఈ వివరణలో ఏ డాక్యుమెంట్ లేదా ఐడీ ప్రూఫ్‌ అవసరం లేదని స్పష్టత ఇచ్చింది.

Also Read: Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?

రూ. 2,000 నోట్లను మార్కెట్‌ చలమాణిలో నుంచి మెల్లిగా రద్దు చేస్తామని తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాటిని మార్చుకోవాలనుకున్న వారు బ్యాంకులు, ఆర్బీఐ రీజినల్ బ్యాంకుల్లోకి వెళ్లాలని తెలిపింది. అక్కడ వీటిని ఎలాంటి రుసుం లేకుండా డిపాజిట్లు లేదా మార్పిడి చేయాలని పేర్కొంది.

ఆర్బీఐ నిర్ణయంపై కొన్ని ముఖ్యమైన పాయింట్లు

01. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆర్బీఐ అనుసరిస్తున్న క్లీన్ నోట్ పాలసీ కింద తీసుకుంది. అయితే, ఈ నోటు మాత్రం చెలామణిలోనే ఉన్నది.

02. రూ. 2000 బ్యాంకు నోట్లను సాధారణ లావాదేవీలకు ఎక్కువగా వినియోగించడం లేదు. వీటి వినియోగం క్రమంగా తగ్గిపోయింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఈ నోట్ల వినియోగం 6.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు (37.3 శాతం నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి) పడిపోయింది. అదే 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ. 2000 నోట్ల చెలామణి 10.8 శాతానికి క్షీణించింది.

03. ఇతర డినామినేషన్ నోట్లు ప్రజల అవసరాలకు సరిపడేట్టుగా ఉన్నాయి.

04. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో వెనక్కి ఇచ్చేయవచ్చు. లేదా ఇతర డినామినేషన్ (రూ. 500, రూ.200, రూ.100... నోట్లతో మార్చుకోవచ్చు) నోట్లతో మార్పిడి చేసుకోవచ్చు.

05. ఒక్కసారి ఈ మార్పిడి (అంటే రూ. 2000 నోట్లను ఇచ్చి ఇతర డినామినేషన్ నోట్లను తీసుకోవడం) రూ. 20,000 వరకు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు వీటిని ఎక్స్‌చేంజ్ లేదా డిపాజిట్ చేసుకునే అవకాశం ఇచ్చింది.

06. రూ.2000 నోట్లను ఇష్యూ చేయడాన్ని వెంటనే ఆపేయాలని బ్యాంకులకు ఆర్బీఐ తక్షణ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా వెనక్కి ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది.