భారత్ జోడో యాత్ర తర్వాత  తనలో  అనేక మార్పులు వచ్చాయని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  తెలిపారు.  

రాయ్‌పూర్:భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి మంచి మద్దతు లభించిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం నాడు ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు, రైతుల కష్టాలను చాలా దగ్గరుండి చూసినట్టుగా చెప్పారు. ఈ యాత్రలో తనకు ప్రజల నుండి ఊహించని మద్దతు లభించిందన్నారు. యాత్ర మొదలు పెట్టాక తనలో అనేక మార్పులు వచ్చినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. పాదయాత్రలో చోటు చేసుకున్న ఘటనలను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. 

ఎండ, వాన, చలిలో కూడా ప్రజలు తనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నాలుగు నెలలు ప్రజల మధ్యే ఉన్నానని ఆయన చెప్పారు. ఈ యాత్రలో లక్షల మంది ప్రజలు తనలో కలిసి నడిచినట్టుగా ఆయన తెలిపారు. తన ఆరోగ్యంపై తనకు అపరిమితమైన విశ్వాసం ఉండేదన్నారు. కానీ భారత్ జోడి యాత్రలో ఆరోగ్యం దెబ్బతిందన్నారు. కానీ తనకు భారతమాత నుండి వచ్చిన సందేశాలు తనలో శక్తిని నింపినట్టుగా రాహుల్ చెప్పారు.

1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సమయంలో తాము ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితుల గురించి రాహుల్ గాంధీ వివరించారు. దేశంలోని మోడీ ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. 

విద్వేషపూరిత ప్రచారంతో దేశాన్ని వినాశనం వైపునకు తీసుకెళ్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా యువత తనకు అపూర్వరీతిలో స్వాగతం పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.