పత్రా చాల్‌  భూ కుంభకోణం మనీలాండరింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌ సతీమణి వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. 

పత్రా చాల్‌ భూ కుంభకోణం మనీలాండరింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయనకు విధించిన కస్టడీ నేటితో ముగియడంతో.. ఈడీ ఆయనను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. దీంతో ప్రత్యేక కోర్టు అతడి కస్టడీని ఈ నెల 8 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్‌ను తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వర్షా రౌత్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వర్షా రౌత్ ఖాతా నుంచి జరిగిన లావాదేవీలు వెలుగులోకి రావడంతో ఆమెకు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి వర్షా రౌత్‌ నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. 

ఇక, పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై 'చాల్' రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, సంజయ్ రౌత్ భార్య, అతని సహచరులకు సంబంధిత లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో వర్షా రౌత్ ఫ్లాట్‌తో పాటు.. సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్, సుజిత్ భార్య స్వప్న పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి.