ప్రతిపక్ష ఇండియా కూటమికి మోహన్ భగవత్ మద్దతు ఇవ్వాలి: సంజయ్ రౌత్
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రతిపక్ష కూటమి ఇండియాకు మద్దతివ్వాలని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రతిపక్ష కూటమి ఇండియాకు మద్దతివ్వాలని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి ఉత్సవ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. భారతదేశం ముందుకు సాగాలని కోరుకోని కొంతమంది ప్రపంచంలో, భారతదేశంలో ఉన్నారని అన్నారు. వారంతా సమాజంలో కక్షలు, ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే ఈ వ్యాఖ్యాలపై స్పందించిన సంజయ్ రౌత్.. మోహన్ భగవత్ ప్రతిపక్షాలకు ఈ విషయాన్ని సూచించడానికి ప్రయత్నిస్తుంటే, ముందుగా మోహన్ భగవత్ ఇండియా కూటమిలో చేరే మొదటి వ్యక్తి కావాలని.. ఎందుకంటే నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. విభిన్న సిద్ధాంతాలున్న వ్యక్తులు ఇండియా కూటమిలోకి వచ్చి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మోహన్ భగవత్ కూడా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలిలని రౌత్ పేర్కొన్నారు.
‘‘ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి సంఘ్ నాయకులు జైలులో ఉన్నారు. విభిన్న అభిప్రాయాలు ఉన్నవారు జైలులో ఉన్నారు. తరువాత వారు భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చి జనతా పార్టీని స్థాపించి నియంతృత్వ పాలనను అంతం చేశారు. లాల్ కృష్ణ అద్వానీ ఇంకా బతికే ఉన్నారు.. ఆయన కూడా జైల్లోనే ఉన్నారు.. ఇది మీకు తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. అటల్ జీని కూడా జైలుకు పంపారు. జయప్రకాష్ నారాయణ్‌తో సహా ఆయనతో పాటు విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు జైలులో ఉండాల్సి వచ్చింది. మోహన్ భగవత్‌కు ఈ విషయాలు చెప్పాల్సి రావడం ఈ దేశ దురదృష్టం’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
లడఖ్‌లోని భారత భూభాగంలో చైనీస్ అక్రమణకు సంబంధించి ఇండియా కూటమి చేస్తున్న వాదనను సంజయ్ రౌత్ మరోసారి ప్రస్తావించారు. ‘‘మీరు (మోహన్ భగవత్) మణిపూర్ గురించి మాట్లాడితే.. లడఖ్ గురించి కూడా మాట్లాడండి. ఈ రోజు దసరా. ఈ రోజు పవిత్రమైన రోజు.. ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడాలి’’ అని సంజయ్ పేర్కొన్నారు.
ఇక, నాగ్‌పూర్‌లో జరిగిన 'విజయదశమి ఉత్సవ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ ప్రసంగిస్తూ.. ‘‘భారతదేశం ముందుకు సాగాలని కోరుకోని కొందరు ప్రపంచంలో, భారతదేశంలో కూడా ఉన్నారు. సమాజంలో కక్షలు, ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మనకు తెలియక, నమ్మకం లేకపోవడం వల్ల మనం కూడా కొన్నిసార్లు అందులో చిక్కుకుపోతాం, అనవసరమైన అవాంతరాలు సృష్టిస్తాం. భారతదేశం పురోగమిస్తే వారి ఆటలు సాగవు. అందుకే వారు పురోగతిని నిరంతరాయంగా వ్యతిరేకిస్తారు. వారు వ్యతిరేకించడం కోసమే ప్రత్యేక సిద్ధాంతాలను అవలంబిస్తారు’’ అని అన్నారు.