సంజయ్ రౌత్‌కు బెదిరింపు కాల్స్ రావడం అవాస్తవం అని, భద్రత పెంచుకోవడానికి స్వయంగా సంజయ్ రౌత్ వేసుకున్న ప్లానే ఇది అని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బెదిరింపులు చేసిన మయూర్ షిండే.. సంజయ్ రౌత్‌తో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే సంచలన ఆరోపణలు చేశారు.
ముంబయి: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యం వహించే శివసేన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్‌కు, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే సునిల్ రౌత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన ఘటన ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులు మయూర్ షిండే, అజహర్ మొహమ్మద్ షేక్‌ను అరెస్టు చేశారు. కానీ, బీజేపీ చేసిన కామెంట్లతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. సంజయ్ రౌత్ స్వయంగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చే కుట్ర చేసుకున్నారని, తద్వార తన భద్రతను పెంచుకోవాలని ఆశించాడని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది.
బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే.. సంజయ్ రౌత్ పై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. బెదిరింపు కాల్స్ చేశాడని పేర్కొంటున్న మయూర్ షిండే నిజానికి సంజయ్ రౌత్ సోదరుడు సునిల్‌కు సన్నిహితుడని బాంబు పేల్చారు. సంజయ్ రౌత్ కావాలనే ఈ కుట్ర పన్నారని, తద్వార మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై బురద జల్లాలని ప్రయత్నించాడని ఆరోపించారు.
Also Read: Cyclone Biparjoy: మరికొన్ని గంటల్లో తుఫాన్.. గుజరాత్ తీరం నుంచి లక్ష మంది తరలింపు
బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఈ వ్యాఖ్యలపై స్పందించి శివసేన యూబీటీ నేత ప్రజలను, ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. బెదిరింపులు చేసిన వ్యక్తిపై దర్యాప్తు చేయాలని, ఆయనను డాన్ అని పేర్కొంటూ కామెంట్ చేశారు. ‘సంజయ్ రౌత్ కుటిల ఆలోచనలు నేడు ప్రజల ముందు బట్టబయలు అయ్యాయి. మయూర్ షిండేను అరెస్టు చేసిన విధానం చూస్తే ఒక కుట్రపూరిత ముప్పు ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. వారు ప్రజలను, ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుదారి పట్టించారు. మయూర్ షిండేకు ఏమైనా క్రిమినల్ శక్తులతో సంబంధాలున్నాయేమో ముంబయి పోలీసులు దర్యాప్తు చేయాలి. ఆయనను సంజయ్ రౌత్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా దర్యాప్తు జరపాలి’ అని పేర్కొన్నారు.
సంజయ్ రౌత్ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. తనకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తులు తన పార్టీకి చెందినవారు కాదని స్పష్టం చేశారు. మయూర్ షిండే బీజేపీ లేదా ఏక్‌నాథ్ షిండే శివసేనకు సంబంధించినవాడై ఉండాలని ఆరోపించారు. ఒక తప్పుడు కేసు బనాయించడానికి ఆయనను ఉపయోగించుకున్నారేమో అని పేర్కొన్నారు.
