బిపర్జోయ్ తుఫాన్ మరికొన్ని గంటల్లో గుజరాత్ తీరం దాటనుంది. తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తీర జిల్లాల నుంచి సుమారు ఒక లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్ శాఖలకు చెందిన బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వైమానిక, నావికా దళం, ఆర్మీతోపాటు కోస్ట్ గార్డు సిబ్బందిగా సిద్దంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.
మరికొన్ని గంటల్లో బిపర్జోయ్ తుఫాన్ గుజరాత్ చేరనుంది. ప్రస్తుతం బిపర్జోయ్ తుఫాను కేంద్రం గుజరాత్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ తుఫాను వెంటే గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ తీర జిల్లాల నుంచి లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
1. ప్రస్తుతం బిపర్జోయ్ తుఫాన్ గుజరాత్ తీరం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది సౌరాష్ట్ర, కచ్ తీరాలను ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దాటే అవకాశం ఉన్నదని, అర్థరాత్రి వరకు భీకర వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది.
2. బిపర్జోయ్ తుఫాన్‌ను కేటగిరీలో 3లోని అత్యంత తీవ్ర తుఫాన్‌గా విభజించింది. ఈ తుఫాన్ గంటలకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను వెంట తీసుకురానుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచే గాలుల వేగం పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది.
3. బిపర్జోయ్ తుఫాన్ తీరం సమీపిస్తున్న కొలదీ వర్ష తీవ్రత పెరుగుతుందని వాతావరణ కార్యాలయం వెల్లడించింది. కచ్, దేవభూమి ద్వారకా, జామ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు దంచి కొట్టే అవకాశాలు ఉన్నాయి.
4. ఇప్పటికే పాలనా యంత్రాంగం కచ్ జిల్లాలో తీరం నుంచి పది కిలో మీటర్ల వైశాల్యంలోని 120 గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
5. గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ ఈ రోజు గాంధీనగర్‌లోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు తీర జిల్లాలు కచ్, జామ్ నగర్, మోర్బి, రాజ్ కోట్, దేవభూమి ద్వారకా, జునాగడ్, పోర్బందర్, గిర్ సోమనాథ్‌ల నుంచి సుమారు ఒక లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని తాత్కాలిక ఆశ్రయాల్లోకి తరలించారు.
6. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాల 12 బృందాలు, రాష్ట్ర రోడ్డు, భవంతుల శాఖకు చెందిన 115 బృందాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 397 బృందాలు తీర జిల్లాల్లో మోహరించి ఉన్నాయి.
7. గుజరాత్ ప్రజల కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహా ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, వారికి సహకరించడానికి సన్నద్ధం చేసి ఉంచామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
Also Read: కేసీఆర్, ఓవైసీల ఫ్రెండ్షిప్ వెనుక లెక్కలు ఇవే.. ముస్లిం ఓట్లతో ఆ పార్టీకి చెక్?
8. రేపటి వరకు అంటే జూన్ 16వ తేదీ వరకు చేపల వేటను రద్దు చేశారు. పోర్టులు మూసేశారు. పడవలను ఒడ్డుకు కట్టారు. తుఫాన్ వస్తున్నందున సముద్రంలో అలలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి.
9. పశ్చిమ రైల్వే తుఫాన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 76 రైళ్లను రద్దు చేసింది. దేవ భూమి ద్వారకా జిల్లాలోని ద్వారకాదీశ్ టెంపులు, గిర్ సోమనాథ్ జిల్లాలోని గిర్ సోమనాథ్ ఆలయాన్ని గురువారం మూసేయనున్నారు.
10. తుఫాన్ రానున్న తరుణం లో సముద్ర అలలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు కు దూకే అవకాశాలు ఉన్నాయని అంచనాలు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. కొన్ని చోట్ల ఈ అలలు మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల వరకూ ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. మే 2021 తర్వాత గుజరాత్ తీరాన్ని తాకనున్న రెండో తుఫాన్ ఇది.
