సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియానే కాదు.. హెచ్ఐవీ లాంటిది కూడా - డీఎంకే ఎంపీ ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్న క్రమంలోనే డీఎంకే కు చెందిన ఎంపీ ఎ.రాజా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన సనాతన ధర్మాన్ని హెచ్ఐవీతో పోల్చారు.

డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతున్న క్రమంలోనే అదే పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీ ఎ.రాజా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన కుడా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎ.రాజా సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, సామాజిక కళంకంతో పోల్చారు.
‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో మాత్రమే పోల్చారని.. కానీ హెచ్ఐవీ, సామాజిక కళంకంతో పోల్చాలని అన్నారు. తనకు అనుమతి ఇస్తే సనాతన ధర్మంపై చర్చకు సిద్ధమని మరో వీడియోలో మీడియాతో ఎ.రాజా పేర్కొన్నారు. ప్రధాని సమావేశం ఏర్పాటు చేసి అనుమతిస్తే క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తరువాత ఏది 'సనాతన ధర్మం' అని వారే నిర్ణయిస్తారని తెలిపారు.
అంతకు ముందు మంగళవారం పుదుచ్చేరిలో దివంగత డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రాజా ప్రసంగిస్తూ సనాతన ధర్మంపై చర్చలో పాల్గొనాలని అమిత్ షాకు, బీజేపీ పెద్దలకు సవాల్ విసిరారు. సనాతన ధర్మం ప్రజల మధ్య అసమానతలను ప్రోత్సహించిందని, మహిళల హక్కులను అణచివేసిందని, మరణించిన భర్త చితిపై కూర్చొని వితంతువు తన జీవితాన్ని త్యాగం చేసే పురాతన ఆచారమైన సతీ సహగమనాన్ని సమర్థించిందని ఆయన అన్నారు.
‘‘మనం అలాంటి పద్ధతులను పునరుద్ధరించాలనుకుంటున్నామా? మేము అన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాము (అలాంటి పద్ధతులను నిర్మూలించడంలో). ఈ సనాతన ధర్మాన్ని అంగీకరించడం పెరియార్ (దివంగత సామాజిక కార్యకర్త, ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి), అన్నా (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై), కలైంజ్ఞర్ (కరుణానిధి) ప్రతిపాదించిన సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఈ ధర్మాన్ని అంగీకరించడం వల్ల సాటి మనుషులకు మనల్ని శత్రువుగా మారుస్తుంది. ఈ ధర్మాన్ని అంగీకరిస్తే నేను మనిషిని కాను’’ అని రాజా అన్నారు.