సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయం అనే భావనకు విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. ‘‘కొన్ని విషయాలను వ్యతిరేకించలేము.. వాటిని పూర్దిగా నిర్మూలించాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాను మనం ఎదిరించలేము.. వాటిని నిర్మూలించాలి. అదే విధంగా సనాతన ధర్మాన్ని (సనాతన ధర్మాన్ని) నిర్మూలించాలి’’ అని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తున్న బీజేపీ నేతలు.. డీఎంకేపై, ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడుతున్నారు.
తాను మారణహోమం అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదని.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. మతంలోని కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పారు. తాను చెప్పినదానికి కట్టుబడి ఉంటాను అని ఉదయనిధి సోమవారం చెన్నైలో విలేకరులతో అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై.. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో పాల్గొన్న హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టుటికోరిన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 10లోగా ఆయన మంత్రి పదవి నుంచి వైదొలగకపోతే, సెప్టెంబర్ 11న చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఆర్‌అండ్‌సిఈ కార్యాలయాల వద్ద బీజేపీ నిరసన తెలుపుతుందని హెచ్చరించారు.
రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరు గురించి మాట్లాడినట్టే.. ఉదయనిధి స్టాలిన్ సనాతన గురించి మాట్లాడారని విమర్శించారు. ఉదయనిధి జూనియర్ రాహుల్ గాంధీ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ ఉత్తర భారతానికి చెందిన పప్పు అయితే.. ఉదయనిధిని ‘‘దక్షిణ భారతదేశపు పప్పు’’ అని విమర్శించారు.
