Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమ బెంగాల్‌లో అఖిలేశ్ యాదవ్.. మమతా బెనర్జీతో భేటీ!

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ రోజు పశ్చిమ బెంగాల్ చేరారు. బెంగాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాలకు నేతృత్వం వహించడానికి అఖిలేశ్ యాదవ్ కోల్‌కతా చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కాబోతున్నారు.
 

samajwadi chief akhilesh yadav to meet bengal cm mamata banerjee
Author
First Published Mar 17, 2023, 4:28 PM IST

కోల్‌కతా: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పశ్చిమ బెంగాల్‌లో దిగారు. ఈ రోజు ఆయన కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగీ దిగగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని అన్నారు. ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసుకుంటున్నదని ఆరోపించారు. బీజేపీకి ముప్పుగా ఎవరు కనిపించినా వారిని టార్గెట్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలతో హరాస్ చేయడం ప్రారంభిస్తుందని వివరించారు.

సమాజ్‌వాదీ పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు సారథ్యం వహించడానికి ఆయన పశ్చిమ బెంగాల్‌కు వచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కాబోతున్నారు. 

‘ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలు బీజేపీకి రాజకీయ ఆయుధాలుగా మారాయి. బెంగాల్‌లో ఈ ఘటనలు తక్కువగా ఉంటాయి. కానీ, యూపీలో మాత్రం అనేక మంది సమాజ్‌వాదీ పార్టీ నేతలు తప్పుడు కేసుల్లో జైలులో మగ్గుతున్నారరు. ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు తప్పుడు కేసుల్లో జైళ్లలో ఉన్నారు’ అని కోల్‌కతా ఎయిర్‌పోర్టు వద్ద విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

వారికి ఇబ్బందిగా తోచిన వారిని వేధించడానికి ఈడీ, సీబీఐలను ప్రతిపక్ష పార్టీల వద్దకు బీజేపీ పంపిస్తున్నదని ఆరోపించారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను ఆమె భర్త దగ్గర నుంచి తెచ్చి తనకు అప్పగించాలని లవర్ పిటిషన్.. హైకోర్టు తీర్పు ఇదే

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాల పై రెండు రోజులు నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్పీ చర్చిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మమతా బెనర్జీతో అఖిలేశ్ యాదవ్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎస్పీ మద్దతు పలికింది. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ.. అఖిలేశ్ యాదవ్ తరఫున ప్రచారం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios