Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ దుమారం రేపిన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు.. అయినా క్షమాపణ చెప్పబోనని స్పష్టీకరణ

రాహుల్ గాంధీ రాముడి లాంటి వ్యక్తి అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖర్షీద్ మంగళవారం వ్యాక్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా తాను క్షమాపణలు చెప్పబోనని ఆయన అన్నారు. 

Salman Khurshid's comments that caused a political uproar.. But he clarified that he will not apologize
Author
First Published Dec 28, 2022, 12:00 PM IST

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బుధవారం రాహుల్ గాంధీని రాముడితో పోల్చడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఖుర్షీద్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా ఖుర్షీద్ తన మాటలపైనే నిలబడ్డాడు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. 

ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి ‘టైమ్స్ నౌ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, రాహుల్ గాంధీ యోగిలా తపస్సు చేస్తున్నారని అన్నారు. తాను రాముడి బాటలో నడుస్తున్నానని తెలిపారు. తన మాటలను వెనక్కి తీసుకోబోనని, క్షమాపణలు చెప్పనని, బీజేపీపై విమర్శలు గుప్పించారు.

‘‘అవును, ఆయన (రాహుల్ గాంధీ) యోగిలా తప్పస్సు చేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లో ఖదౌతో శ్రీరాముడి బాటలో నడుస్తున్నారు. అతడిని యోగి అని పిలిచినందుకు బీజేపీ నన్ను జైలులో పెట్టదు. నేను చెప్పినదానికి నేను క్షమాపణ చెప్పను’’ అని ఖుర్షీద్ అన్నారు. 

ఇంతకీ ఖుర్షీద్ ఏమన్నారంటే ? 
కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రను రామాయణ ఇతిహాసంతో పోల్చారు. రాహుల్ గాంధీ అంటే రాముడు అని, కాంగ్రెస్ అంటే భారత్ అని అన్నారు. ‘రాహుల్ గాంధీ మానవాతీతుడు. మనమంతా గడ్డకట్టే చలిలో జాకెట్లు ధరిస్తున్నాం. కానీ ఆయన మాత్రం కేవలం టీ-షర్టుల ధరించి (భారత్ జోడో యాత్ర కోసం) బయటకు వెళ్తున్నాడు. ఆయన ఏకాగ్రతతో తపస్సు చేసే యోగి వంటివాడు ’’ అని అన్నారు. 

‘‘శ్రీరామచంద్రుని ‘ఖడౌ’ చాలా దూరం వెళుతుంది. కొన్నిసార్లు రామ్ జీ చేరుకోలేనప్పుడు.. భరతుడు ‘ఖడౌ’ తీసుకొని ప్రదేశాలకు వెళ్తాడు. అదే విధంగా మేము కూడా ఉత్తర ప్రదేశ్ లో ‘ఖడౌ’ను తీసుకువెళ్ళాం. ఇప్పుడు ఆ ‘ఖడౌ’ ఉత్తర ప్రదేశ్ కు చేరుకుంది. రామ్ జీ (రాహుల్ గాంధీ) కూడా వస్తారు’’ అని ఆయన అన్నారు.

మండిపడ్డ బీజేపీ
సల్మాన్‌ ఖుర్షీద్‌పై చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముడి 'సేన' మాదిరిగానే కాంగ్రెస్ నాయకులను నగ్నంగా తిరగాలని సూచించారు. ‘ఒక వేళ రాహుల్ గాంధీ రాముడి అవతారమైతే.. ఆయనకు చలి పెట్టకుండా ఏం తింటాడో ఆయన సేనకు కూడా చెప్పాలి. ఆయన సేన కూడా రాముడి సేన తరహా నగ్నంగా ఎందుకు తిరగడం లేదు’ అంటూ ఆయన ప్రశ్నించారు. చలి పెట్టకుండా ఉండటానికి ఆయన ఏం తీసుకుంటాడో.. ఆయన తల్లికి, సోదరికి కూడా చెప్పాలని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios