Asianet News TeluguAsianet News Telugu

పిల్లలను కంటే సాలరీ హైక్.. ఏడాదిపాటు సెలవులు.. మన దేశంలోనే ఎక్కడంటే?

మన దేశంలోని ఓ రాష్ట్రం జననాల రేటు పెంచడంపై ఫోకస్ పెట్టింది. అత్యల్ప జనాభా గల సిక్కిం రాష్ట్రంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరిని కంటే ఒక సారి సాలరీ హైక్, ముగ్గురిని కంటే రెండు సార్లు సాలరీ హైక్ ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. అంతేకాదు, వారి పిల్లలను చూసుకోవడానికి ప్రత్యేకంగా మహిళలను రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని వివరించింది.
 

salary hike for having children more than one in sikkim state
Author
First Published Jan 23, 2023, 12:59 PM IST

న్యూఢిల్లీ: మన దేశ జనాభా పై ఆందోళనలు, జనాభా కట్టడికి చర్యలు చూస్తూనే ఉంటాం. కుటుంబ నియంత్రణకు ప్రభుత్వమే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇద్దరికి మించి పిల్లలను కంటే పలు అవకాశాలనూ ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇవన్నీ ఒక వైపు సాగుతుండగా.. మన దేశంలోనే ఓ రాష్ట్రంలో జననాల రేటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. పిల్లలను కనాలని కోరుతున్నది. ఇద్దరు పిల్లలను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు కూడా చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటు మెటర్నిటీ లీవులనూ గ్రాంట్ చేయనుంది. అంతేకాదు, ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఏడాదిపాటు ప్రత్యేకంగా ఓ మహిళను నియమించి జీతం కూడా చెల్లించనుంది. 

ఈ ఆఫర్ బహుశా మన దేశంలో కాదనే అనుకుంటారు. కానీ, ఇది మన దేశంలోనే.. ఆ రాష్ట్రం పేరు సిక్కిం. మన దేశంలో అత్యల్ప జననాల రేటు ఈ రాష్ట్రంలో ఉన్నది. కేవలం 7 లక్షల అతి స్వల్ప జనాభా గల సిక్కిం రాష్ట్రంలో జననాల రేటు పెంచి జనాభాలో సమతుల్యత పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వం పై ఆఫర్లు ప్రకటించింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం సిక్కింలో 2022లో జననాల రేటు 1.1గా ఉన్నది. అంటే సగటున ఒక మహిళ ఒక్కరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదే దేశ సగటు చూసకుంటే 2022 లో 2.159 ఉన్నది. అంటే సగటున ఇద్దరు పిల్లలను కంటున్నారు. ఇటీవలి కాలంలో సిక్కింలోని 12 తెగల్లో భూతియా, లింబు కమ్యూనిటీల జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

Also Read: రాత్రి 8 గంటల తర్వాత పిల్లలను కనలేం.. మార్కెట్లకు జనాభా నియంత్రణకు లింక్ పెట్టిన పాక్ మంత్రి.. నెట్టింట వైరల్

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో శుక్రవారం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మాట్లాడుతూ, స్థానిక తెగల జనాభా తగ్గిపోతుండటం ఆందోళనకరంగా ఉన్నదని, దీన్ని ఆపడానికి మన చేతుల్లోని అన్ని మార్గాలను పాటించి రివర్స్ చేయాలని పేర్కొన్నారు. స్థానిక జనాభాను పెంచడానికి పిల్లలను కనే తెగల మహిళలకు ఆర్థిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలూ అందిస్తామని ఇటీవలే ఆయన తెలిపారు. 

మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరిని కంటే ఒక సారి సాలరీ హైక్ ఇస్తామని, ముగ్గురు పిల్లలను కంటే రెండు హైక్‌లు కల్పిస్తామని సిక్కిం ప్రభుత్వం తెలిపింది. అలాగే, వారి పిల్లలను చూసుకోవడానికి 40 ఏళ్లకు పైబడిన మహిళలను రిక్రూట్‌మెంట్ చేసుకుని రూ. 10 వేల చొప్పున వారికి వేతనం ఇస్తామని, వారు ఏడాది పాటు ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటారని వివరించింది.

గతేడాదే నవంబర్‌లో మహిళలకు మెటర్నిటీ సెలవులను ఏడాదికి పెంచింది. పురుషులకు నెల రోజుల పెటర్నిటీ సెలవులు ప్రకటించింది. అలాగే, ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందే జంటలకు ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios