సారాంశం

తమకు న్యాయం జరిగే వరకు  ఆందోళనను  కొనసాగిస్తామని  సాక్షి మాలిక్  ప్రకటించారు.  


న్యూఢిల్లీ: ఆందోళన విరమించలేదని  రెజ్లర్  సాక్షిమాలిక్ ప్రకటించారు.  తాము ఆందోళన విరమించినట్టుగా  మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని  ఆమె ఖండించారు.  తమకు న్యాయం జరిగే  వరకు  పోరాటం సాగుతుందని సాక్షిమాలిక్  ప్రకటించారు.  సత్యాగ్రహంతో  పాటు రైల్వేలో  తన బాధ్యతను నిర్వహించనున్నట్టుగా  ఆమె  ప్రకటించారు.  తమ పోరాటం  సాగుతుందని  ఆమె స్పష్టం  చేశారు.  దయచేసి ఎలాంటి  తప్పుడు  వార్తలను  ప్రసారం చేయవద్దని  సాక్షిమాలిక్  మీడియాను  కోరారు . ట్విట్టర్ వేదికగా  సాక్షి మాాలిక్ ఈ విషయాన్ని  ప్రకటించారు.

 

సాక్షి మాలిక్ తో పాటు  భజరంగ్  పునియా కూడ తమ విధుల్లో  చేరారు.  దీంతో  రెజర్లు తమ ఆందోళనలను విరమించారని మీడియాలో కథనాలు  ప్రసారమయ్యాయి.  అయితే   ఈ కథనాలపై  సాక్షి మాలిక్ ఆగ్రహం వ్యక్తం  చేశారు.  తమకు  న్యాయం జరిగే  వరకు  పోరాటం  చేస్తామని  ప్రకటించారు సాక్షి మాలిక్.

 

రెజర్లు  తమ ఆందోళనలను  కొనసాగిస్తారని  సాక్షి మాలిక్ భర్త  రెజ్లర్   సత్యవర్త్  కడియన్  స్పష్టం  చేశారు.  సోమవారంనాడు  మధ్యాహ్నం ఆయన  జాతీయ న్యూస్ ఏజెన్సీకి  ఈ విషయాన్ని  చెప్పారు.  గతంలో  ప్రభుత్వంతో  జరిగిన  చర్చల్లో  ఎలాంటి  నిర్ణయం తీసుకోలేదని  కూడ ఆయన  తెలిపారు.  ఆందోళనను విరమించినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను  ఆయన ఖండించారు. నిరసనను కొనసాగిస్తామని ఆయన  చెప్పారు. 

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్  బ్రిజ్ భూషణ్ తమపై  లైంగిక వేధింపులకు  పాల్పడినట్టుగా  మహిళా  రెజర్లు  ఆరోపిస్తున్నారు. ఈ  విషయమై  తమకు న్యాయం చేయాలని  కోరుతూ  ఈ ఏడాది  జనవరిలో  రెజర్లు ఆందోళనను ప్రారంభించారు.  పలు  రాజకీయ పార్టీలు  రెజర్లకు మద్దతును ప్రకటించాయి.  అయితే  గత వారంలో  గంగా నదిలో తమకు  వచ్చిన  పతకాలను  కలపాలని  రెజర్లు  నిర్ణయించారు.  అయితే  రెజర్లకు రైతు సంఘాలు  నచ్చజెప్పాయి. దీంతో  రెజర్లు తమ పతకాలకు  గంగానదిలో కలపకుండా వెనక్కి తిరిగారు.  
ఈ నెల  3వ తేదీన   కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షాతో  రెజర్లు  సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత  విధుల్లో చేరాలని  రెజర్లు  నిర్ణయం తీసుకున్నారు. అయితే  విధుల్లో చేరడంతో   రెజర్లు  తమ  ఆందోళనను విరమించినట్టుగా  ప్రచారం సాగింది.  కానీ  ఈ ప్రచారాన్ని సాక్షి మాలిక్  ఖండించారు.