Ayodhya Ram Mandir : దెబ్బతిన్న జాతీయ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ప్రతీక : సద్గురు వ్యాఖ్యలు
జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించనున్నారు. ప్రాణ ప్రతిష్టపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ రామమందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలిపారు
జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించనున్నారు. ప్రాణ ప్రతిష్టపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ రామమందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలిపారు. రామ మందిర నిర్మాణం దెబ్బతిన్న జాతీయ స్పూర్తికి పునరుజ్జీవనమని సద్గురు వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిరాన్ని దేశమంతా ఏకతాటిపై స్వాగతిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రామాలయం నాగరికత పునరుద్ధరణకు ప్రతీక అని ఈషా ఫౌండేషన్ వ్యవస్ధాపకుడు చెప్పారు. రాముడు, రామాయణం భారతీయ నైతికతతో ముడిపడి వున్న అంశమని జగ్గీవాసుదేవ్ అన్నారు. ఇది దాదాపు దెబ్బతిన్న జాతీయ స్పూర్తికి పునరుజ్జీవనం వంటిదని ఆయన తెలిపారు. రాజ్యాన్ని, భార్యను కోల్పోయినప్పటి నుంచి చివరి వరకు బాధలతో నిండిపోయిందన్నారు. అయినప్పటికీ వీటన్నింటి మధ్య సమస్ధితిని కొనసాగించగల శ్రీరాముడి సామర్ధ్యం నేటికీ ఆయనను అసాధారణంగా చేస్తోందని వాసుదేవ్ తెలిపారు. ప్రస్తుత కాలంలో రాముడి ఔచిత్యాన్ని గురించి సద్గురు వివరిస్తూ ప్రజలు రాముడిని అతని జీవితంలో విజయం కోసం కాదు, కష్టతరమైన క్షణాలను ఎదుర్కొన్న దయ కోసం ఆరాధిస్తారని చెప్పారు.
రామ మందిరం కోసం 500 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందుకే దేశంలో ఈ స్థాయిలో ఉత్సాహం వుందని సద్గురు పేర్కొన్నారు. మొత్తం ఉద్యమాన్ని దేశంలోని సామాన్య ప్రజలు నిర్వహించారని ఆయన ప్రశంసించారు. ప్రధాని మోడీ శ్రీరాముడికి 11 రోజులుగా పూజలు చేస్తున్నారని, ఆయన దేశానికి ఎన్నికైన నాయకుడని సద్గురు కొనియాడారు. న్యాయమైన, స్ధిరమైన నాయకుడికి చిహ్నంగా భావించే రాముని కర్మలను ఆయన నిర్వహిస్తున్నారని తెలిపారు. మోడీ ఒక్కరే కాదు.. న్యాయమైన, స్ధిరమైన , సుసంపన్నమైన భారతదేశాన్ని సృష్టించడానికి దేశ నాయకులు , పౌరులంతా ఇందులో భాగం కావాలని జగ్గీవాసు దేవ్ ఆకాంక్షించారు.
భారతదేశంలో రామరాజ్య ఆవశ్యకతను హైలైట్ చేస్తూ.. రాముడు ఉత్తమ రాజుగా పరిగణించబడుతున్నాడని సద్గురు పేర్కొన్నారు. రాముని పరిపాలన అత్యం దయగల, న్యాయమైన పరిపాలనగా పరిగణించబడుతోందన్నారు. 6000 సంవత్సరాల కాలంలో ఈ నాగరికత నిర్మాణానికి రాముని కాలం ఒక పునాదిగా మారిందన్నారు. ఉత్తమ పరిపాలన, సంపూర్ణ న్యాయమైన రాష్ట్రం అంటే రామరాజ్యమని జగ్గీవాస్ దేవ్ చెప్పారు. మరోవైపు.. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి సద్గురును రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరు కావడం లేదు.