ఎన్ఐఏ కొత్త డీజీగా సదానంద్ వసంత్ డాటే.. ఆయన నేపథ్యం ఇదే..
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా కొనసాగుతున్న సదానంద్ వసంత్ డాటే ను ఎన్ఐఏకు డీజీగా నియమిస్తూ కేంద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా సదానంద్ వసంత్ డాటే ను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ గా కొనసాగుతున్నారు. ఆయన 1990 బ్యాచ్ కు చెందిన మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.
మార్చి 31న పదవీ విరమణ చేయనున్న దినకర్ గుప్తా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో అజ్మల్ కసబ్, అతని లష్కరే తోయిబా సహచరుడు అబు ఇస్మాయిల్ లతో పోరాడి, గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాగా.. సదానంద్ వసంత్ డాటే పేదరికంలో పుట్టి పెరిగారు.
26/11 దాడిలో కీలక పాత్ర పోషించినందుకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ అందుకున్నారు. కాగా.. ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డీఐజీగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో ఐజీ (ఓపీఎస్), ముంబై సమీపంలోని మీరా-భయందర్, వసాయి-విరార్ సిటీ (ఎంబీవీవీ) పోలీస్ కమిషనర్ గా కూడా పని చేశారు.
డాటే 2026 డిసెంబర్ 31న పదవీ విరమణ చేసే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అకడమిక్ చదువులో ప్రతిభ కనబర్చారు. అలాగే సివిల్ సర్వీసెస్ లో ప్రవేశానికి కఠినమైన యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. హంఫ్రీ ఫెలోషిప్ పొంది 'ఎకనామిక్ క్రైమ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఇట్స్ నేచర్' వంటి అంశాలను అధ్యయనం చేశారు. అయితే ఆయన తుపాకులతో పాటు కలాన్ని కూడా మెరుగ్గా హ్యాండిల్ చేయగలరు... 'వర్దిత్యా మన్సచ్యా నోండి' అనే మరాఠీ పుస్తకాన్ని రాశారు.