నిర్భయ అత్యాచార దోషుల ఉరిశిక్షకు సంబంధించి తీహార్ జైలు అధికారులు సన్నాహకాలు మొదలుపెట్టారు. దోషుల బరువుకు సమానమైన ఇసుక సంచులను వినియోగించి ఆదివారం ట్రయల్స్ నిర్వహించారు. తీహార్ జైలు ఉరికంబంపై ఇప్పటి వరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరి తీయడానికి అవకాశం ఉంది.

Also Read:ఉరిశిక్ష: నాడు ఆ నలుగురు, ఇప్పుడు నిర్భయ దోషులు

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్భయ నేరస్థుల నలుగురిని ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం నిర్భయపై అత్యాచారం, హత్యకు కారణమైన ముఖేశ్ సింగ్, పవన్ కుమార్, అక్షయ్ కుమార్, వినయ్ శర్మలను దోషులుగా నిర్థారించారు.

ఈ క్రమంలో నలుగురిని జనవరి 22న ఒకేసారి ఉరి తీయాల్సిందిగా ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం జనవరి 14న తీర్పు వెలువరించనుంది.

ఆ తీర్పును అనుసరించి ప్రస్తుతం 2, 4 నంబర్ జైలులో ఉంచిన వీరిని ఉరిశిక్ష అమలుకు వీలుగా మూడో నంబర్ గదికి మార్చనున్నారు. మరణశిక్షకు ముందు నేరస్థులను చివరి సారిగా కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Also Read:నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

శిక్షను ఎలా అమలు చేస్తామనే దానికి సంబంధించిన వివరాలను దోషులకు తెలిపారు. వీరు సాధారణంగానే ఉన్నారని.. వారి ప్రవర్తన అసహజంగా ఏమీ లేదని, పరిస్ధితిని ఆకళింపు చేసుకున్నారని జైలు అధికారులు తెలిపారు. ఉరిశిక్ష అమలు కోసం బీహార్ లోని బక్సార్ జైలు నుంచి ఉరి తాళ్లను తెప్పించామని.. ఉరితీతకు ఇద్దరు తలారులను పంపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు.