సచిన్ పైలట్ మరోసారి అశోక్ గెహ్లాట్ పై పోరును ప్రారంభించారు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ఎందుకు నోరుమెదపడం లేదని గెహ్లాట్‌ను ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లడం కంటే ముందుగా అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి కోసం ఏప్రిల్ 11వ తేదీన నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వివరించారు.
జైపూర్: రాజస్తాన్‌లో మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వివాదం తెరమీదకు వచ్చింది. సొంత ప్రభుత్వాన్నే వ్యతిరేకిస్తూ సచిన్ పైలట్ మంగళవారం నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నిస్తూ ఆయన అశోక్ గెహ్లాట్ పై ఆరోపణలు చేశారు. సచిన్ పైలట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా సచిన్ పైలట్ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొంది. అది పార్టీ వ్యతిరేక చర్య అని స్పష్టం చేసింది.
సచిన్ పైలట్ నిర్ణయాన్ని ఏఐసీసీ రాజస్తాన్ ఇంచార్జీ సుఖ్‌జిందర్ సింగ్ రంధవా తప్పుపట్టారు. సచిన్ పైలట్‌కు సొంత ప్రభుత్వంతో ఏమైనా సమస్య ఉంటే దాన్ని పార్టీలోనే చర్చించవచ్చని అన్నారు. అంతేకానీ, మీడియాలో, ప్రజల్లో చర్చ రేపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐదు నెలలుగా తాను రాజస్తాన్‌కు ఇంచార్జీగా ఉన్నారని, కానీ, ఎప్పుడూ సచిన్ పైలట్ ఈ ఇష్యూ గురించి తనతో మాట్లాడలేదని అన్నారు. ఇప్పటికీ తాను సచిన్ పైలట్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. సచిన్ పైలట్ నిస్సందేహంగా పార్టీకి ఒక ఆస్తి అని పేర్కొంటూ.. ఆయన లేవనెత్తిన అంశంపై చర్చలు జరపడానికి సిద్ధమని వివరించారు.
Also Read: ఈసీ సవరణ తర్వాత జాతీయ పార్టీల జాబితా ఇదే.. జాతీయ హోదా పొందాలంటే అర్హతలేమిటంటే?
గతవారం అశోక్ గెహ్లాట్ పై పోరును సచిన్ పైలట్ మరోసారి మొదలుపెట్టారు. మరికొన్ని నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దారి ఎంచుకోవడం గమనార్హం. 2018 వరకు అధికారంలో ఉన్న వసుంధర రాజే ప్రభుత్వ అవినీతి, మోసాలపై అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనం వహిస్తున్నారని పైలట్ ప్రశ్నించారు.
అప్పటి బీజేపీ మంత్రి అవినీతిపై అశోక్ గెహ్లాట్ గతంలో చేసిన ఆరోపణల వీడియోను సచిన్ పైలట్ ప్లే చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఎదుర్కోవడానికి ముందుగా ఈ ఆరోపణలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
