ఎన్నికల సంఘం ఈ రోజు టీఎంసీకి, ఎన్సీపీకి, సీపీఐకి షాక్ ఇచ్చింది. వాటి జాతీయ హోదాను తొలగించింది. అలాగే, కొత్తగా ఆప్‌నకు జాతీయ హోదాను కల్పించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో ఇప్పుడు జాతీయ హోదాల పార్టీల వివరాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ జాబితాలో ఆరు పార్టీలు ఉన్నాయి. జాతీయ హోదా పొందడానికి గల అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం సోమవారం పార్టీల హోదాపై కీలక ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలకు జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. కాగా, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కట్టబెట్టింది.
ప్రాంతీయ పార్టీలు వేరు.. జాతీయ పార్టీలు వేరు. ఒక ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీలను ప్రాంతీయ పార్టీలు అంటారు. ఉదాహరణకు తమిళనాడులోని డీఎంకే, ఒడిశాలోని బీజేడీ, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపి, తెలంగాణలోని బీఆర్ఎస్, బిహార్‌లోని ఆర్జేడీ లాంటివి ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీ హోదా పొందాలంటే నిర్దేశిత షరతులను అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రకారం జాతీయ హోదా పొందిన పార్టీలు ఇవే.
1. ఆమ్ ఆద్మీ పార్టీ
2. బహుజన్ సమాజ్ పార్టీ
3. భారతీయ జనతా పార్టీ
4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)
అయితే, జాతీయ హోదా పొందాలంటే ఈసీఐ కొన్ని షరతులను విధించింది. ఆ కండీషన్లు ఇలా ఉన్నాయి.
1. జాతీయ హోదా పొందాలంటే.. ఆ పార్టీ నాలుగు రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ‘గుర్తింపు’(నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి) పొంది ఉండాలి.
2. గత లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో కనీసం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లిన ఓట్లల్లో కనీసం 6 శాతం ఓట్లను ఆ పార్టీ పొందగలగాలి. దీనితోపాటు ఒకటి లేదా ఎక్కువ రాష్ట్రాల్లో కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.
3. గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం సీట్లల్లో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకుని ఉండాలి. ఆ సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి.
