Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లో మరోసారి పొలిటికల్ హీట్.. సచిన్ పైలట్ ఓ ద్రోహి.. వాళ్లకు రూ. 10 కోట్లు అందాయి: అశోక్ గెహ్లాట్ ఫైర్

రాజస్తాన్‌లో మరోసారి రాజకీయ దుమారం రేగింది. సచిన్ పైలట్ ఒక ద్రోహి అని, పార్టీని మోసం చేశాడని, ఆ మోసగాడిని సీఎం చేయరాదని అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వారికి రూ. 10 కోట్లు పంచి పెట్టిందని ఆరోపణలు చేశారు.

sachin pilot a traitor, rs 10 crore distributed fires ashok gehlot
Author
First Published Nov 24, 2022, 6:19 PM IST

న్యూఢిల్లీ: సీఎం పోస్టు కేంద్రంగా అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్ పై సంచలన ఆరోపణలు చేశారు. సచిన్ పైలట్ ఓ ద్రోహి అంటూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో సీఎంను చేయవద్దని అన్నారు. ఎన్డీటీవీకి అశోక్ గెహ్లాట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒక మోసగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాకూడదు అంటూ సచిన్ పైలట్‌ను ప్రస్తావిస్తూ అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ సచిన్ పైలట్‌ను సీఎం చేయడం కుదరదు అని వివరించారు. ఆయన వెంట 10 ఎమ్మెల్యేలు కూడా లేరని అన్నారు. సచిన్ పైలట్ తిరుగుబాటు చేశాడని, పార్టీకే ద్రోహం చేశాడని, ఒక మోసగాడు అని ధ్వజమెత్తారు. సచిన్ పైలట్ మినహా రాజస్తాన్‌లోని 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిని సీఎంగా ఎంచుకున్నా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.

Also Read: మరోసారి సీఎం కుర్చీ కోసం పైలట్ పేచీ? ‘అనిశ్చితికి ముగింపు పలకాలి’.. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ వ్యాఖ్యలు

సెప్టెంబర్‌లో అశోక్ గెహ్లాట్ వర్గీయులు కూడా తిరుగుబాటు చేయడాన్ని ప్రస్తావించగా ‘నేను అదే విషయాన్ని చెబుతున్నాను. సచిన్ పైలట్‌ను సీఎం చేస్తారనే వార్త వ్యాపించింది. అందుకే రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. సచిన్ పైలట్ స్వయంగా అలాగే ప్రవర్తించాడు. ఆయననే సీఎం చేస్తారని ప్రజలు అనుకున్నారు. పైలట్ కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇదే కోణంలో మాట్లాడాడు. అందుకే సచిన్ పైలట్‌ను సీఎం చేయకూడదని ఒక తీర్మానం ఉండాలనే వారు అలా చేశారు’ అని అశోక్ గెహ్లాట్ వివరించారు.

సచిన్ పైలట్ ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడ వారు ఇద్దరు కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిశారని పేర్కొన్నారు. వారికి కోట్ల రూపాయలు పంపించారని వివరించారు. కొందరికి రూ. 5 కోట్లు, మరికొందరికి రూ. 10 కోట్లు పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసు నుంచే ఆ డబ్బులు వచ్చాయని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ దూతలను మాత్రం కలువలేదని వివరించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ప్రూఫ్‌లు ఉన్నాయని తెలిపారు.

సొంత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసే పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ఆ గేమ్ అంతా వారిదే అని పేర్కొన్నారు. బీజేపీనే రూ. 10 కోట్లు పంచిపెట్టిందని అన్నారు. అందుకు సంబంధించి తన దగ్గర ప్రూఫ్‌లు కూడా ఉన్నాయని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios