భారత ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నూతన చైర్మన్‌గా ఎస్ సోమనాథ్‌ నియమితులయ్యారు. ఆయన ఈ నెల 14వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా కే శివన్ ఉన్నారు. ఆయన ఈ నెల 14వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎస్ సోమనాథ్ ప్రస్తుతం విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

న్యూఢిల్లీ: భారత ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO)కు నూతన చైర్మన్‌‌(New Chairman)గా సీనియర్ రాకెట్ సైంటిస్టు(Rocket Scientist) ఎస్ సోమనాథ్ (S Somanath)ఎంపికయ్యారు. ఈ నెల 14వ తేదీన ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా కే శివన్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసినా.. ఒక ఏడాది కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ నెల 14వ తేదీన ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. అదే రోజు ఎస్ సోమనాథ్.. ఇస్రోకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు పదో చైర్మన్‌గా సేవలు అందించనున్నారు. అదే సమయంలో ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు సెక్రెటరీగానూ బాధ్యతలు తీసుకుంటారు.

ఎస్ సోమనాథ్ ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇస్రో చైర్మన్‌గా నియమాకం అయిన తర్వాత ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, భారత అంతరిక్ష రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో, ఇన్ స్పేస్, ఇండస్ట్రీ, స్టార్టప్‌లు అన్నీ కలిసి భారత అంతరిక్ష కార్యకలాపాలను భారీగా విస్తరింపజేయాలని భావించారు. ఇదే ప్రథమ కర్తవ్యంగా ఉంటుందని వివరించారు. స్పేస్ లాంచ్ వెహికిల్స్‌లో సిస్టమ్ ఇంజినీరింగ్‌ సైంటిస్టుగా ఆయన కీలక కృషి చేశారు. ఇస్రో చైర్మన్‌గా ఆయన మూడేళ్లు విధులు నిర్వహించనున్నారు.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా ఎంపిక కావడానికి ముందు లిక్విడ్ ప్రపోల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా రెండున్నరేళ్లు చేశారు. కే శివన్, ఎస్ సోమనాథ్‌లు ఇరువురూ స్పేస్ ఆర్గనైజేషన్‌లో ఒకే తీరులో తమ కెరీర్‌ను చేపట్టారు. ఇరువురూ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. వీరిద్దరూ జియో సింక్రనస్ స్పేస్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా పని చేశారు. ఎర్నాకుళంలోని మహారాజ కాలేజీ, కొల్లాంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎస్ సోమనాథ్ చదివారు. 1985 విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌లో చేరారు. ఇందులో జాయిన్ అయిన తొలి రోజుల్లో ఆయన పోలార్ స్పేస్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో పని చేశారు. 1995 నుంచి 2002 కాలంలో ఆయన పీఎస్‌ఎల్వీ ప్రాజెక్టు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది అక్టోబర్‌లో ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వ అధీనంలోనే కొనసాగిందని, తాము ఈ ఆలోచనను మార్చివేసి ప్రైవేటు భాగస్వామ్యాన్ని జోడిస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు. తద్వారా ప్రభుత్వానికి, స్టార్టప్‌ల మధ్య సమన్వయానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పుడీ సమయంలో అంతరిక్షం రంగంలో భారత్ దూసుకుపోవడానికి ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అన్నీ ప్రభుత్వ అధీనంలోనే జరిగేవని, ఇకపై ప్రభుత్వం ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడానికీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం.. నైపుణ్యాలను ప్రైవేటు భాగస్వామ్యంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నదని, ప్రైవేటు రంగానికి స్పేస్ లాంచ్‌ప్యాడ్‌లను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నదని వివరించారు. ఇప్పుడు ఇస్రో సదుపాయాలు ప్రైవేటురంగానికి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.