SCO సమ్మిట్: SCO సమ్మిట్ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు స్వాగతం పలికిన విధానం నెట్టింట్లో వైరలవుతోంది.  

భారత్‌ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల విదేశాంగ మంత్రి స్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి. అలాగే.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో చైనా విదేశాంగ మంత్రి చిన్ కాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తదితరులు పాల్గొంటారు.

ఎస్ జైశంకర్, బిలావల్ భుట్టో మధ్య ఏమైనా చర్చలు జరుగుతాయా?

ఈ సదస్సుకు Pakistan విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా హజరుకానున్నారు. ఈ సమావేశలంో 
పాల్గొనడానికి ముందుగానే.. విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ఈ సమావేశంలో భారత్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన భుట్టోకు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికి విధంగా వార్తల్లో నిలిచింది. 

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం సందర్భంగా సభ్య దేశాల విదేశాంగ మంత్రులందరినీ వేదికపై ఎస్ జైశంకర్ స్వాగతించారు. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వేదికపైకి రాగానే.. కరచాలనం కాకుండా దూరం నుంచే నమస్కారం పెట్టారు జైశంకర్. దీంతో బిలావల్ భుట్టో కూడా నమస్తే చెప్పాల్సి వచ్చింది. ఫోటో సెషన్ తర్వాత..భారత విదేశాంగ మంత్రి భుట్టోను వేదిక అవతలి వైపుకు వెళ్లమని సైగ చేశారు.

SCO సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్‌ (S Jaishankar) గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చినట్టు తెలుస్తోంది. గోవా సముద్ర తీరంలో ఉన్న తాజ్‌ రిసార్ట్‌లో విదేశీ అతిథులకు ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ డిన్నర్‌కు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులతో పాటు పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో కూడా హజరయ్యారంట. 

స్వాగతం పలికే సమయంలోనే ఎడమొఖం పెడమొఖంగా ఉన్న వీరిద్దరూ ఈ విందులో బిలావల్‌, జైశంకర్‌ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, ఈ విందులో వీరిద్దరూ పరస్పరం పలకరించుకుని, కరచాలనం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు పలు మీడియా కథనాల సమాచారం. పాక్‌ మీడియా కూడా దీన్ని ప్రచురించాయి. కానీ, భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. 

ఎస్‌సీవో సదస్సు కోసం బిలావల్‌ భారత్‌కు వచ్చే ముందు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పాక్‌కు ‘ఎస్‌సీవో చార్టర్‌ (SCO Charter)’పై ఉన్న గౌరవంతోనే తాను సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన నేతలతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. అదే సమయంలో భారత్ తో ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. 

 SCO ఎప్పుడు స్థాపించబడింది?

SCO 2001లో షాంఘైలో స్థాపించబడింది. SCOలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్థాన్, తజికిస్థాన్ , ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. ఈ ఏడాది గ్రూప్‌కు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. 2017లో SCOలో భారతదేశం, పాకిస్తాన్ శాశ్వత సభ్యత్వం పొందాయి. SCO సంస్థ యొక్క దేశాలలో భారతదేశం ఒక ముఖ్యమైన దేశంగా ఉద్భవించింది. ఈ సంస్థలో చైనా, రష్యా ప్రధాన దేశాలు. ఈ సంస్థ నాటోకు ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో SCO లో సభ్యత్వం ఉన్నప్పటికీ, భారతదేశం కూడా నాలుగు దేశాల సంస్థ అయిన క్వాడ్‌లో సభ్యదేశంగా ఉంది. భారత్‌తో పాటు, క్వాడ్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. రష్యా, చైనాలు క్వాడ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.