Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించాలి - మంత్రి కేటీఆర్

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  తెలంగాణలోని ప్రతీ గ్రామంలో సంక్రాంత్రి వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. సంబరాల సమయంలో ప్రతీ ఒక్కరు కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. 

rythubandu celabrations should be held till Sankranthi festival - Minister KTR
Author
Hyderabad, First Published Jan 8, 2022, 8:16 PM IST

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  తెలంగాణలోని ప్రతీ గ్రామంలో సంక్రాంత్రి వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రైతు బంధు ప‌థ‌కం ప్రారంభ‌మైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద రూ.50 వేల కోట్లు అందిన నేప‌థ్యంలో ఈ సంబరాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో కోవిడ్ ప‌రిమితులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సూచించిన కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ  సంబ‌రాలు జ‌రుపుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. 

ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ గైడ్ లైన్స్ మేర‌కు ర్యాలీలకు, ఊరేగింపు అనుమతి లేని నేపథ్యంలో నిబంధ‌న‌ల మేర‌కు సంబ‌రాలు చేసుకోవాల‌ని మంత్రి చెప్పారు.టీఆర్ఎస్  పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  గ‌త నెల డిసెంబ‌ర్ 28వ తేదీన తెలంగాణ రైతుల‌కు రైతుబంధు ప‌థ‌కం కింద యాసంగి సీజ‌న్‌కు పెట్టుబ‌డి సాయం అందించ‌డం ప్రారంభించింది. 

తెలంగాణ రైతుల మ‌న్న‌న‌లు పొందిన ప‌థ‌కం రైతుబంధు. ఈ ప‌థకం కింద ఏడాదికి ఎక‌రానికి రూ.10 వేల చొప్పున ప్ర‌భుత్వం పెట్టుబడి సాయంగా అంద‌జేస్తుంది. ప్ర‌తీ ఏడాది వానాకాలం పంట వేసే ముందు ఒక సారి, యాసంగి లో పంట వేసే ముందు రెండో సారి పెట్టుబ‌డి సాయం అంద‌జేస్తోంది.2018 మే 18వ తేదీన ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని నిర్విరామంగా అమ‌లు చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఈ రైతు బంధు ప‌థ‌కం అమ‌లు కోసం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. 14,800 కోట్లు కేటాయించింది. 

ఈ సీజ‌న్ లో రైతుబంధు కోసం రూ.7600 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ అంచ‌నా వేసింది. అందులో భాగంగానే ఆ నిధుల‌ను స‌మ‌కూర్చుకుంది. గ‌తంలో మాదిరిగానే ఈ సారి కూడా త‌క్కువ ఎక‌రాలు ఉన్న రైతులకు ముందుగా త‌రువాత ఎక్కువ ఎక‌రాలు ఉన్న రైతులకు విడ‌త‌ల వారీగా పెట్టుబ‌డి సాయం అందించింది. ఎక‌రం ఉన్న రైతుల‌కు మొద‌టి రోజు, రెండు ఎక‌రాలు ఉన్న రైతులకు రెండో రోజు ఇలా నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జ‌మ చేస్తూ పోయింది. 

ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు రైతుల ఖాతాల్లో రైతుబంధు ప‌థ‌కం కింద ఇచ్చే నిధులు 50 వేల కోట్లు దాటుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఈ ప‌థ‌కం కింద రైతులకు పెట్టుబ‌డి అందిన నేప‌థ్యంలో సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ భావించింది. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో రైతుల అకౌంట్లలో రైతుబంధు పెట్టుబ‌డి సాయం జ‌మ అయిన నాటి నుంచి సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిశేకాలు నిర్వ‌హిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీలు తీస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను గుర్తు చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాలు వంటి ప‌థ‌కాలు రైతుల‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని కొనియాడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios